Begin typing your search above and press return to search.

పవన్ తోనే పోటీ...మంత్రులను చమటలు పడుతున్నాయా...?

By:  Tupaki Desk   |   15 Oct 2022 2:30 AM GMT
పవన్ తోనే పోటీ...మంత్రులను చమటలు పడుతున్నాయా...?
X
ఆయన ఎన్నికల రాజకీయాంలో ఓడితే ఓడవచ్చు గాక. కానీ ఆయన సినీ గ్లామర్ విషయంలో ఎవరికీ ఎటువంటి డౌట్లూ లేవు. ఉండకూడదు కూడా. అర్ధరాత్రి అయిదు నిముషాల ముందు ఆయన అడ్డరోడ్డులో సభ పెట్టినా అప్పటికపుడు లక్షలాది మంది జనాలు అట్టే పోగు అవుతారు. దటీజ్ పవన్ కళ్యాణ్ అని అంతా ఒప్పుకుని తీరాల్సిందే. ఏపీ రాజకీయాల్లో ఇపుడు అతి పెద్ద క్రౌడ్ పుల్లర్ ఎవరూ అంటే రెండవ సెకన్ కూడా ఆలోచించకుండా ఠక్కున చెప్పే పేరే పవన్ కళ్యాణ్ అని.

అలాంటి పవన్ తో వైసీపీ మంత్రులకు పోటీ వచ్చి పడింది. నిజానికి అది వారు తాముగా పెట్టుకున్న పోటీ కాదు. పవన్ తో పోటీకి ఎవరు తెలిసి తెలిసి వెళ్తారు. కానీ అది అలా కుదిరింది. అనివార్యంగా వైసీపీ మంత్రులు పవన్ తో పోటీ పడాల్సి వస్తోంది. విషయానికి వస్తే విశాఖలో ఈ నెల 15న వైసీపీ ఆద్వర్యంలో విశాఖ గర్జన జరగనుంది. నాన్ పొలిటికల్ జేఏసీ అని పేరుకు చెబుతున్నా మొత్తం అంతా వైసీపీ గర్జనగానే ఉంది.

సరిగ్గా అదే రోజున పవన్ విశాఖ టూర్ పెట్టుకున్నారు. ఆయన విశాఖలో మూడు రోజుల పాటు బస చేయనున్నారు. ఈ నెల 15న సాయంత్రం విశాఖ గర్జన అంటే మధ్యాహ్నం పవన్ వైజాగ్ వస్తున్నారు. ఇక సాయంత్రం విశాఖ గర్జనకు కచ్చితంగా లక్ష మంది అయినా జనాలు హాజరయ్యేలా చూడాలని వైసీపీ పట్టుదల మీద ఉంది. దాంతో మూడు జిల్లాల నుంచే పార్టీ ఎమ్మెల్యేలకు నాయకులకు టార్గెట్లు పెట్టి మరీ జనసమీకరణ చేస్తోంది.

ఒక విధంగా చెప్పాలీ అంటే జనాల నుంచి విశాఖ రాజధాని విషయంలో పెద్దగా స్పందన లేదు. అప్ప ఆరాటమే కానీ బావ బతికేట్టు లేడు అన్నట్లుగా విశాఖ జనాలతో పాటు ఉత్తరాంధ్రా వాసులకు ఏమంత పెద్దగా రాజధాని గోడు పట్టడంలేదు. దాంతో అన్నీ తమ నెత్తిన వేసుకుని గర్జనను నడిపిస్తున్న వైసీపీకి ఇపుడు మా చెడ్డ చిక్కు వచ్చిపడుతోంది.

జనాలు కనుక గర్జనలో పెద్దగా కనిపించకపోయినా పేలవంగా గర్జన గొంతు వినిపించినా అసలుకే ఎసరు అవుతుందని భయపడుతున్నారు. మామూలుగా అయితే ఎంత జనాలు వచ్చినా సూపర్ సక్సెస్ అని చెప్పేసుకోవచ్చు. కానీ అదే రోజున పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్నారు. దాంతో జనసేన నాయకులు వైసీపీ నేతలకు మరింత టెన్షన్ పెట్టేలా పోటీగా పవన్ స్వాగత కార్యక్రమాన్ని కూడా గట్టిగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

విశాఖ ఎయిర్ పోర్టు దాకా వేలాది మంది జనసైనికులతో భారీ ర్యాలీగా వెళ్ళి పవన్ కి ఘన స్వాగతం పలకాలని జనసేన డిసైడ్ కావడంతో వైసీపీ మంత్రులకు హై బీపీ పెరిగిపోతోంది అని అంటున్నారు. పవన్ విశాఖ వస్తేనే వేలాదిగా జనాలు రోడ్ల మీదకు వచ్చి ఆయనకు ఆహ్వానం పలికితే విశాఖ రాజధాని కోసం చేసే గర్జన ఏ రేంజిలో ఉండాలి. వైసీపీ వారు చెబుతున్నట్లుగా లక్షలాదిగా జనాలు రావాలి. నేల ఈనాలి. ఆకాశానికి చిల్లు పడాలి. కానీ అలాంటి సీన్ ఉంటుందా అన్నదే ఇపుడు డౌట్ అంటున్నారు.

ఎంత జనసమీకరణ చేసినా ఎంతమంది వస్తారో ఇప్పటికైతే క్లారిటీ లేదు. మంత్రుల మధ్యన పెద్దగా కో ఆర్డినేషన్ లేదని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. ఏ కారణం చేత అయినా గర్జన పీల గొంతుతో వినిపిస్తే మాత్రం జగన్ నుంచి చీవాట్లు తప్పవన్న బెంగ ఎటూ ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ విశాఖ రావడం వల్ల గర్జన సీన్ ఎలా ఉంటుందో అన్న బెంగ అయితే వైసీపీలో పెద్ద ఎత్తున ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.