Begin typing your search above and press return to search.

100 చోట్ల పోటీ.. అస‌దుద్దీన్‌.. `యూపీ` వ్యూహం ఏంటి?

By:  Tupaki Desk   |   5 July 2021 12:37 AM GMT
100 చోట్ల పోటీ.. అస‌దుద్దీన్‌.. `యూపీ` వ్యూహం ఏంటి?
X
దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కేందుకు స‌మాజ్ వాదీపార్టీ స‌హా కాంగ్రెస్ కూట‌మి పార్టీలు కూడా వ్యూహాత్మ‌కంగా క‌దులుతున్నాయి. ఇక‌, ఇప్ప‌టికే అధికారంలో ఉన్న బీజేపీ.. తిరిగి ఇక్క‌డ కాషాయ పతాకాన్ని రెప‌రెప‌లాడించ‌డం ద్వారా.. కేంద్రంలోముచ్చ‌ట‌గా మూడోసారి కూడా అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌తిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యం తెర‌మీద‌కి వ‌చ్చింది. తెలంగాణ‌కు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ.. అప్పుడే యూపీపై త‌న‌దైన శైలిలో ఆయ‌న క‌దులుతున్నారు.

కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన బిహార్ ఎన్నిక‌ల్లో 20 స్థానాల్లో పోటీ చేసి అయిదు చోట్ల గెలుపొందిన ఎంఐఎం ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌పై గురిపెట్టింది. 100 సీట్లలో పోటీ చేస్తామని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించడం.. కాంగ్రెస్ స‌హా.. అధికారంపై ఆశ‌లు పెట్టుకున్న స‌మాజ్‌వాదీ పార్టీని తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టేసింది. అదేస‌మ‌యంలో బీజేపీలో పెద్ద ఎత్తున హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. బ‌ల‌మైన‌ ముస్లిం ఓటు బ్యాంకు చీలుతుంద‌నే! ఇక‌, అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే అస‌దుద్దీన్ దరఖాస్తులు ఇవ్వడం ప్రారంభించారు. ముస్లింలు అధికంగా ఉన్న 100 నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆయ‌న ఎంచుకున్నారు.

ఈ క్ర‌మంలోనే షెడ్యూల్డ్‌ భారతీయ సమాజ్‌ వాదీ (ఎస్‌బీఎస్‌పీ), చిన్న పార్టీల కూటమైన భాగీదార్‌ సంకల్ప్‌ మోర్చాతో కలిసి పనిచేస్తామని ఒవైఐసీ ప్రకటించారు. సుహల్దేవ్‌ భారతీయ సమాజ్‌పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాష్‌ రాజ్‌భర్‌ పలు చిన్న పార్టీలతో భాగీదరి సంకల్ప్‌ మోర్చా ఏర్పాటు చేశారు. ఈ పార్టీల పొత్తు కారణంగా పలు జిల్లాలో బలంగా ఉన్న ముస్లింలు, ఇతర వర్గాలు కలిస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంతవరకు ముస్లిం ఓట్లు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు పడుతుండగా, ఎంఐఎం రాకతో వాటికి నష్టం జరిగే అవకాశం ఉందని.. అదేస‌మ‌యంలో బీజేపీ మ‌రోసారి ల‌బ్ధి పొందేందుకు ఛాన్స్ ఉంటుంద‌ని రాజకీయ వర్గాల్లో గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి అస‌దుద్దీన్.. ఎలాంటి వ్యూహంతో.. ఎవ‌రికి ల‌బ్ధి చేకూరుస్తారో .. చూడాలి.