Begin typing your search above and press return to search.

ఎంతమందికి ఫిర్యాదు చేస్తారు ?

By:  Tupaki Desk   |   14 July 2022 5:34 AM GMT
ఎంతమందికి ఫిర్యాదు చేస్తారు ?
X
వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఒకే ఘటనపై వీలైనంత ఎక్కువమందకి ఫిర్యాదులు చేయాలని, దర్యాప్తు చేయించాలని డిసైడ్ అయినట్లే ఉన్నారు. ఎందుకంటే తాజాగా సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న నరేంద్రరెడ్డిపై వెంటనే కేసులు నమోదుచేసి దర్యాప్తు చేయాలంటు సీఆర్పీపీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ ను కలిసి ఫిర్యాదుచేశారు.

తనను చంపేందుకు కుట్ర జరిగిందని ఆరోపణలు చేస్తున్న ఎంపీ అందుకు తగ్గ ఆధారాలను మాత్రం ఎవరికీ ఇవ్వటం లేదు. తాజాగా కుల్దీప్ ను కలిసిన ఎంపీ ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ తనింట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సీసీ ఫుటేజీని అందించారు. తనింటి దగ్గరున్న ఫరూక్ తో ఒక కారులో ఒక వ్యక్తి మాట్లాడినట్లు ఆరోపించారు. కారులో కూర్చుని మాట్లాడిన వ్యక్తి విషయమై ఆరాతీస్తే ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో పనిచేసే నరేందర్ రెడ్డిగా తెలిసిందన్నారు.

ఈ నరేందర్ రెడ్డి స్టీఫెన్ రవీంద్రకు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడట. కాబట్టే ఇద్దరిపైనా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేయాలని అడిగారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదే విషయమై విచారణ చేయించాలని కేసీయార్ కు ఒక లేఖ రాసున్నారు.

అలాగే కోర్టులో కూడా పిటీషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఇది సరిపోదన్నట్లుగా ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేష్ ఆస్ధానాను కలిసి కేసులు నమోదు చేసి విచారణ చేయాలని లేఖ అందించారు.

ఇవన్నీ సరిపోదన్నట్లుగా ఇపుడు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ ను కలిసి మళ్ళీ ఫిర్యాదు చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఎంపీ ఎంతమంది దగ్గరకు వెళ్ళినా ఎలాంటి ఉపయోగం ఉండదని గ్రహించటం లేదు. ఇదే సమయంలో ఫరూక్ ను ఎంపీ సిబ్బంది పట్టుకుని రోడ్డు మీద కొట్టి కారులోకి బలవంతంగా ఈడ్చుకెళ్ళటం, మళ్ళీ ఎంపీ ఇంట్లో కొట్టినట్లు వీడియో సాక్ష్యాలున్నాయి.

ఈ ఆధారాలను చూపించి ఫరూక్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎంపీ, కొడుకు భరత్ తో పాటు పీఏ శాస్త్రి, సీఆర్పీఎఫ్ సిబ్బందిపైన గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. తనపైన నమోదైన కేసులను కొట్టేయాలని కోర్టులో ఎంపీ వేసిన పిటీషన్ను కోర్టు కొట్టేసింది. దాంతో ఎంపీకి ఇబ్బందులు తప్పేట్లులేదు. అందుకనే ఎంపీ ఇపుడు ఎదురు కేసులు పెడుతున్నట్లు అర్ధమవుతోంది.