Begin typing your search above and press return to search.

అధికార పార్టీ ఎమ్మెల్యేపై హెచ్చార్సీలో ఫిర్యాదు

By:  Tupaki Desk   |   5 Jan 2016 6:27 AM GMT
అధికార పార్టీ ఎమ్మెల్యేపై హెచ్చార్సీలో ఫిర్యాదు
X
శంకర్‌ నాయక్...వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ ఎమ్మెల్యే. ఉద్యమాల ఖిల్లా అయిన వ‌రంగ‌ల్‌ లో తెలంగాణ గాలి బ‌లంగా వీస్తున్న స‌మ‌యంలో టీఆర్ ఎస్ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నిక‌యింది మొద‌లు ఆయ‌న‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ‌తంలో ప్ర‌భుత్వ స్థ‌లం క‌బ్జా చేశార‌నే ఫిర్యాదు, ఆ త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నేత‌లను బెదిరించార‌నే ఆరోప‌ణ‌..ఇలా త‌ర‌చూ శంక‌ర్ నాయక్ వార్త‌ల్లో నానుతుంటారు. ఇపుడు ఎమ్మెల్యే బాధితులు లోకాయుక్త‌ను - హెచ్చార్సీని ఆశ్ర‌యించే స్థాయికి ప‌రిస్థితి చేరిపోయింది.

తన భూమిని కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని పేర్కొంటూ బాధితుడు బానోత్ వీర‌న్న లోకాయుక్తకు - మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతో మహబూబాబాద్‌ పట్టణ సీఐ నిర్మాణంలో ఉన్న త‌న‌ ఇల్లును కూలగొట్టించడమే గాకుండా ప్రతిరోజు ఫోన్‌ చేస్తూ బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని బానోత్‌ వీరన్నవాపోయాడు. ఈ విషయంలో ఎంపీ - ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మున్సిపల్‌ కార్యాలయం ఇచ్చిన గృహ నిర్మాణ అనుమతిని రద్దు చేయించారని అన్నారు. ఎమ్మెల్యే - సీఐలు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తన ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేయించడం వ‌ల్ల తాను ఎనిమిది లక్షలు నష్టపోయానని వాపోయారు. తెలంగాణ గిరిజన సంఘం నేతలతో క‌లిసి బాధితుడు బానోత్‌ వీరన్నల బృందం కలిసి రాష్ట్ర లోకాయుక్త - మానవ హాక్కుల కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు.

బాధితుడు రాష్ర్ట స్థాయి న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఆశ్ర‌యించాడంటే ఎమ్మెల్యే చ‌ర్య‌ల‌తో ఎంత‌గా విసిగిపోయి ఉంటాడో. వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లోనే ఉన్న సీఎం కేసీఆర్ ఈ విష‌యంపై దృష్టి సారిస్తారో లేదో చూడాలి మ‌రి.