Begin typing your search above and press return to search.

జగన్ మీద కంప్లైంట్.. వైసీసీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్

By:  Tupaki Desk   |   25 Nov 2022 9:35 AM GMT
జగన్ మీద కంప్లైంట్.. వైసీసీ ఎమ్మెల్యేల్లో  కొత్త టెన్షన్
X
చేతిలో అధికారం ఉంది. తమ అధినేత మీద బోలెడంత భయం.. భక్తి ఉంది. వీటికి మించిన విధేయత ఉంది. తిమ్మిని బమ్మిని చేసి.. తానుఅనుకున్నది చేసే అధినేత తీరును చూసుకొని మురిసిపోయిన ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితుల్లోకి వచ్చేశారు. ఇంతకాలం తమకేమీ కాదన్న ధీమాతో ఉన్న వారికి.. ఇప్పపుడు తమ కిందకే నీళ్లు వచ్చేయటంతో వారు కిందా మీదా పడుతున్నారు.

ఎమ్మెల్యేల పని తీరును సమీక్షించి వారి పని తీరు ఆధారంగానే తర్వాతి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలా? వద్దా? అన్న నిర్ణయానికి వస్తానని సీఎం జగన్ తెగేసి చెప్పటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదంత సులువా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేసినా.. ఇప్పుడు ఆ ప్రక్రియ మరింత ముందుకు వెళ్లటం అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎమ్మెల్యేల మీద రిపోర్టులు సిద్ధంగా ఉండటం.. అవి కూడా మూడు వేర్వేరు సంస్థలతో పాటు.. నిఘా విభాగం ఇచ్చిన నివేదికను క్రాస్ చెక్ చేసి మరీ ప్రోగ్రెస్ రిపోర్టు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

దీంతో.. పని చేయని కొందరు ఎమ్మెల్యేలతో పాటు.. విమర్శలు.. ఆరోపణలు ఉన్న వారికి సైతం ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళలో పార్టీలో కొత్త చర్చ మొదలైంది. అసలు అధినేత పిలుపునిచ్చిన ప్రోగ్రాంను ఎమ్మెల్యేలు ఫాలో కాకపోవటాన్ని తప్పుగా చూపిస్తున్నారు కానీ..

అసలు ఎందుకు వెళ్లలేదు? అన్న ప్రశ్నను ఎవరూ అడగరేం? అన్నది ఆవేదన. నిధుల లేమి.. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా.. తమకు ఎదురయ్యే సమస్యలకు సమాధానాలు చెప్పే పరిస్థితి లేకపోవటం.. హామీలు ఇచ్చేందుకు నిధుల కొరత.. వెరసి.. ఈ చికాకులకు దూరంగా ఉండేందుకు వెళ్లలేదే తప్పించి.. తమకు మరో కారణం లేదంటున్నారు.

నిజానికి గడప గడపకు ప్రోగ్రాంను చూస్తే.. కొమ్ములు తిరిగిన మంత్రుల్ని సైతం జనాలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయటాన్ని ప్రస్తావిస్తున్నారు. వారికే తప్పలేదు.. తమ లాంటోళ్ల సంగతేమిటన్నది వారి ఆవేదన. అలా అని తమ మనసులోని మాట చెప్పే పరిస్థితి లేదని..

అలాఅని ఎవరితోనూ షేర్ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. ఇంతకాలం సర్లే అనుకున్న వారు సైతం.. ఇప్పుడు తమ పీఠాలు కదిలే పరిస్థితి రావటంతో.. తమ మనసులోని బాధను.. అధినేత చేస్తున్న తప్పుల్ని ప్రస్తావిస్తూ ఆఫ్ ద రికార్డు గా ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేలపై చర్యలు షురూ చేస్తే.. ఈ గొంతులు మరిన్ని పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.