Begin typing your search above and press return to search.

సీఎంఓ కు ఫిర్యాదు: వైసీపీ ఎమ్మెల్యే 100 కోట్ల భూపంచాయితీ!

By:  Tupaki Desk   |   30 Dec 2019 4:19 AM GMT
సీఎంఓ కు ఫిర్యాదు: వైసీపీ ఎమ్మెల్యే 100 కోట్ల భూపంచాయితీ!
X
దాదాపు 100 కోట్లు విలువ చేసే భూమి అదీ.. తెలంగాణ లోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట శివారు ప్రాంతంలోని 40 ఎకరాలు అదీ.. ఈ భూమి తమదంటే తమదని ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యే తో పాటు కొంత మంది బాధితులు పోరాడుతున్నారు. దాదాపు 100 కోట్ల విలువ చేసే ఈ భూమి పంచాయతీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంది. రెండు రాష్ట్రాల్లో ఆ వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీనిపై తెలంగాణ పోలీస్, రిజిస్ట్రేషన్ శాఖలు దృష్టి సారించి ఎవరిది ఈ భూమి అనేది తేల్చే పనిలో పడ్డాయి.

తుఫ్రాన్ పేట శివారు ప్రాంతం లోని 40 ఎకరాలు భూమి విలువ 100 కోట్లుపైనే ఉంటుందట.. ఇక్కడ ఎకరం 2.50 కోట్ల పైనే పలుకుతోంది. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే ఈ భూమి తనదేనంటూ తాజాగా బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో భూమి చుట్టూ రక్షణ చర్యలు చేపట్టారు. అయితే ఈ స్థలాలు 20 ఏళ్ల కిందటే తాము కొన్నామని కొంత మంది బాధితులు ఆందోళనకు దిగారు.

ఈ వివాదాస్పద స్థలంలో 20 ఏళ్ల క్రితమే సుమారు 50 ఎకరాల్లో శివప్రియనగర్2 పేరుతో వెంచర్ ఏర్పాటు చేశారు. ఇందులో 40 ఎకరాలు వెంచర్ చేసి 828 ప్లాట్లు చేసి స్థానిక పగడాల వంశస్థులకు కర్నూలు కు చెందిన ఓ రెడ్డి పెద్దాయన 2001 సంవత్సరంలో విక్రయించాడు. ఈ ప్లాట్లను తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ కొనేశారు.

అయితే తాజాగా కర్నూలు జిల్లా కు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆ భూమి తనదేనంటూ చుట్టూ కందకాలు తవ్వించి బోర్డులు పెట్టడంతో 20 ఏళ్ల కిందటకొన్న వారంతా ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిదుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ చివరకు తెలంగాణ సీఎంవో వద్దకు వెళ్లింది.

దీనిపై సదురు వైసీపీ ఎమ్మెల్యే కూడా స్పందించాడు. 2008లో తాను తన భార్య పేరుతో ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. నా కంటే ముందే బాధితులు కొనుంటే వారికే ఈ భూమి ఇచ్చేస్తాని అంటున్నారు.

అయితే ఈ భూమిని అమ్మిన కర్నూలుకు చెందిన రెడ్డివారు ఇలా భూములను చాలా మందికి అమ్మి మోసం చేశారని.. ఆయనపై కేసులు నమోదై జైలు కు కూడా వెళ్లారని తెలిసింది. సో ఈ భూవివాదంలో అసలు దోషి ఆ భూమిని అమ్మిన వ్యక్తేనని వైసీపీ ఎమ్మెల్యే కూడా కొని మోసపోయాడని తెలుస్తోంది.