Begin typing your search above and press return to search.

ఎంపీ జేసీ వ్యాఖ్యల కలకలం..న్యాయసమీక్ష

By:  Tupaki Desk   |   24 April 2019 8:16 AM GMT
ఎంపీ జేసీ వ్యాఖ్యల కలకలం..న్యాయసమీక్ష
X
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు.. ఎప్పుడు ఎవరిని పొగుడుతారో.. ఎవరిని తిడుతారో కూడా తెలియదు. సొంత పార్టీ టీడీపీ అధినేతపైనే విమర్శలు చేయగల సత్తా ఉన్న నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అలాంటి నేత తాజాగా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీనిపై కొందరు ఈసీకి ఫిర్యాదు చేసి ఏకంగా న్యాయపోరాటానికి సిద్దమవ్వడం అనంతపురం రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ అభ్యర్థులు రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టారని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై న్యాయ విచారణ చేయించాలని తాజాగా ఏపీ పీసీసీ కార్యదర్శి జి.నాగరాజు డిమాండ్ చేశారు. అనంతపురం డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్ని పార్టీలతో కలిసి దీనిపై పోరుబాటకు సిద్ధమయ్యారు. ఫ్లకార్డులు ప్రదర్శించారు.

ఒక్కొక్క ఓటుకు ఏపీలో రూ.5వేల వరకు పంచారని.. ఒక్కో అభ్యర్థి రూ.50కోట్ల వరకు ఖర్చు చేశారని.. ఈ లెక్కన ఏపీలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.10వేల కోట్లు దాటి ఉంటుందని జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో చెప్పడం సంచలనమైంది.

ఈసీ వైఫల్యాలపై పత్రికలు మీడియాలో వార్తలు రావడంతో వాటిపైన ఈసీ చర్యలు తీసుకోలేదని.. ఎన్నికల్లో ధనప్రవాహం ఉందని తాము ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. ఈసీపై వస్తున్న ఆరోపణలపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని సుమోటాగా తీసుకొని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.