Begin typing your search above and press return to search.

కొత్త‌ప‌ల్లి 'గీత‌' దాటేయ‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   6 July 2017 7:18 AM GMT
కొత్త‌ప‌ల్లి గీత‌ దాటేయ‌లేద‌ట‌!
X
అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత ఇప్పుడు సుడిగుండంలోనే చిక్కుకున్న‌ట్లున్నారు. ఓ వైపు తాను ఎస్టీ కాకున్నా త‌ప్పుడు ధృవీక‌ర‌ణ ప‌త్రంతో ఎస్టీ కోటా సీటును ఎగుర‌వేసుకుపోయారంటూ ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్ర‌స్తుతం ఈ విష‌యంపై అటు విశాఖ జిల్లా రెవెన్యూ యంత్రాగం - ఎన్నిక‌ల క‌మిష‌న్ మ‌ధ్య ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు న‌డుస్తున్నాయి. మ‌రోవైపు భ‌ర్త రియ‌ల్ ఎస్టేట్ మోసాల‌తో కొత్త‌ప‌ల్లి గీత పెను వివాదాల్లో కూరుకుపోయారు. ఉమ్మ‌డి ఏపీలో రెవెన్యూ శాఖ‌లో కీల‌క అధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన గీత‌... హైద‌రాబాదు శివార్ల‌లో భారీ ఎత్తున భూముల‌ను త‌న ఖాతాలో వేసుకున్నార‌ని, ఇప్పుడు వాటి ఆధారంగానే ప‌లువురు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు - రాజ‌కీయ నేత‌ల‌తో వ్యాపారం చేస్తూ వారిని మోసం చేస్తున్నార‌ని గీత‌, ఆమె భ‌ర్త‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై కేసులు కూడా న‌మోద‌య్యాయి.

ఒకానొక సంద‌ర్భంలో త‌న భ‌ర్త కిడ్నాప్‌ న‌కు గుర‌య్యారంటూ గీత చేసిన ఆరోప‌ణ‌లు తెలుగు రాష్ట్రాల్లోనే సంచ‌ల‌నంగా మారాయి. ఏపీకి చెందిన గీత‌ - తెలంగాణ‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యవ‌హారాలు న‌డుపుతూ వివాదాల్లో కూరుకుపోతున్నారంటూ ఆమె స‌న్నిహితులు ఒకింత వాపోతున్నారు. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ త‌ర‌ఫున అర‌కు లోక్‌ స‌భ స్థానం నుంచి బ‌రిలోకి దిగిన గీత‌... విజ‌యం సాధించి పార్ల‌మెంటులో అడుగుపెట్టారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ స్వ‌ల్ప మార్జిన్‌ తో అధికారానికి దూరం కాగా... ఏపీలో అధికార ప‌గ్గాలు చేజిక్కించుకున్న టీడీపీ వైపు ఆమె చూశారు. అదే అద‌నుగా వైసీపీని మరింత‌గా దెబ్బ‌కొట్టాల‌న్న రాజ‌కీయ వ్యూహంతో అడుగులు వేసిన టీడీపీ... కొత్త‌ప‌ల్లి గీత‌తో పాటు నంద్యాల నుంచి వైసీపీ టికెట్‌ పై విజయం సాధించిన ఎస్పీవై రెడ్డిని కూడా లాగేసింది.

క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌ను కూడా లాగేయాల‌ని టీడీపీ చేసిన య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ప్ర‌స్తుతం ఎస్పీవై రెడ్డితో పాటు కొత్త‌ప‌ల్లి గీత‌లు టీడీపీకి అనుకూలంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వీరిద్ద‌రూ పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డార‌ని, వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన స్పీక‌ర్ కార్యాల‌యం ఇప్ప‌టికే ఎస్పీవై రెడ్డి వ్వ‌వ‌హారాన్ని తేల్చేయాల‌ని స‌భా హ‌క్కుల క‌మిటీకి ఆదేశాలు జారీ చేయ‌గా... తాజాగా కొత్తప‌ల్లి గీత విష‌యాన్ని కూడా త్వ‌ర‌గానే తేల్చండంటూ క‌మిటీకి స్పీక‌ర్ కార్యాల‌యం నుంచి ఆదేశం అందింది. దీంతో రంగంలోకి దిగిన స‌భాహ‌క్కుల క‌మిటీ... గీత‌కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఇదిలా ఉంటే... వైసీపీ ఫిర్యాదు విష‌యాన్ని తెలుసుకున్న‌ గీత‌... కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. తాను పార్టీకి దూరం కాలేద‌ని, పార్టీ అధిష్ఠాన‌మే త‌న‌ను దూరంగా పెడుతోంద‌ని నేరుగా స్పీక‌ర్ కే ఫిర్యాదు చేశారు. గీత‌పై వైసీపీ ఫిర్యాదు - వైసీపీపై గీత ఫిర్యాదు... రెండింటిపైనా విచార‌ణ నిర్వ‌హించి వాస్త‌వ‌మేమిటో తేల్చేయాల‌ని స్పీక‌ర్ స‌భాహ‌క్కుల క‌మిటీకి ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో... నోటీసులు జారీ అయితే త‌మ వాద‌న‌లు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అయితే క‌మిటీ నుంచి ఆదేశాలు వ‌స్తే.. తాను కూడా త‌న వాద‌న‌ను వినిపించేందుకు సిద్ధంగానే ఉన్నాన‌ని గీత కూడా చెబుతున్నారు. మ‌రి ఈ రెండు వాద‌న‌లు వినే క‌మిటీ... ఎవ‌రి వాద‌న క‌రెక్ట్ అని తేలుస్తుందో చూడాలి.