Begin typing your search above and press return to search.

'మే' 2 తర్వాత దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ ?

By:  Tupaki Desk   |   27 April 2021 10:34 AM GMT
మే 2 తర్వాత దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ ?
X
కరోనా వైరస్ విజృంభణ తో ఇండియా ప్రస్తుతం విలవిల్లాడుతోంది. కరోనా వైరస్ భయంతో చిగురుటాకులా వణికిపోతోంది. ఉప్పెనలా విరుచుకుపడుతున్న వైరస్‌ తో జనం భయంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రులన్ని కూడా కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. కనీసం కరోనా తో చచ్చిపోయిన వారికి దహన సంస్కారాలు చేయడానికి కూడా క్యూ లైన్ లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే .. ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్‌ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ , తమిళనాడు ల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. కర్ణాటక లో ఈ రోజు నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని చాలా నగరాలు, పట్టణాల్లో కూడా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే , కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్‌ డౌన్ విధిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పశ్చిమ బెంగాల్‌లో ఆరుదశల పోలింగ్ ముగిసింది. చివరి దశ పోలింగ్ ముగిసిన వెంటనే .. మే2న ఐదు రాష్ట్రాలతో పాటు అన్ని ఉపఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. మే2 ఫలితాలు ప్రకటించిన తర్వాత , వెంటనే దేశవ్యాప్తంగా మళ్లీ సంపూర్ణ లాక్‌ డౌన్ విధించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. .కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో లాక్‌డౌన్ విధింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆక్సీజన్ సరఫరా, అత్యవసర మందులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ వరుస సమావేశాలకు ఇదే కారణమని అభిప్రాయ పడుతున్నారు.అంతేకాదు మే, జూన్ నెలలో దేశ ప్రజలందరికీ ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 80 కోట్ల మంది పేదలకు బియ్యం, గోధుమలను పంపిణీ చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించబోతున్నారని.. అందుకే ఉచిత రేషన్‌పై కేంద్రం ప్రకటన చేసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ మరోసారి వద్దు అని అనుకున్నా కూడా .. కరోనా సెకండ్ పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో లాక్‌డౌన్ తప్ప వేరొక మార్గం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే , లాక్ డౌన్ పై స్పష్టత రావాలి అంటే మే 2 వరకు వేచి చూడాల్సిందే.