Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర లో వీకెండ్స్ లో సంపూర్ణ లాక్ డౌన్ ...అవన్ని క్లోజ్ , సర్కార్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   5 April 2021 6:30 AM GMT
మహారాష్ట్ర లో వీకెండ్స్ లో సంపూర్ణ లాక్ డౌన్ ...అవన్ని క్లోజ్ ,  సర్కార్ కీలక నిర్ణయం
X
ప్రపంచంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది, ఇక కరోనా పీడ తొలగిపోయినట్టే అనుకుంటున్న సమయంలో మరోసారి కరోనా విజృంభణ తో అందరూ ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలో కూడా కరోనా సెకండ్ వేవ్ మొదలై .. వేగంగా వ్యాపిస్తుంది. భారత్ లో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో సగం మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

రాష్ట్రంలో రాత్రివేళ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది. ఉదయం సమయంలో సెక్షన్‌ 144, రాత్రిపూట కర్ఫ్యూతోపాటు వీకెండ్‌లో అంటే శని, ఆదివారారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవలను ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. ఆంక్షలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్తగా విడుదల చేసిన ఆంక్షలు ఏప్రిల్‌ 30వ తేదీ వరకు కొనసాగుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుందని దీంతో లాక్‌డౌన్‌ పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి అనేక మంది నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, పత్రిక యాజమాన్యం, సంపాదకులతోపాటు అన్ని రంగాల ప్రతినిధులతోపాటు వివిధ పార్టీల నేతలతోనూ విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి ప్రతిపక్షాలు కూడా మద్దతు పలికాయి.

ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించాలని పేర్కొంది. ప్రజా రవాణా వాహనాలను 50 శాతం సామర్థ్యంతోనే తిప్పాలని స్పష్టం చేసింది. హోటళ్లలో పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా పగటివేళల్లోనే ఫుడ్ డెలివరీలకు అనుమతి ఇచ్చింది. హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేయనున్నారు. త్వరలోనే పరిస్థితిని సమీక్షించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. రైళ్లు, విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.