Begin typing your search above and press return to search.
తుపాకీ స్పెషల్:జమిలి ఎన్నికలు అవసరం-నేపథ్యం..లాభనష్టాలు
By: Tupaki Desk | 2 Feb 2018 10:09 AM GMTరాష్ర్టాల అసెంబ్లీలు - లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన మళ్లీ చర్చల్లోకి వచ్చింది. మోదీ చాన్నాళ్లుగా చెబుతున్న ఈ మాటకు గత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మద్దతు పలకగా మొన్నటికి మొన్న ప్రస్తుత రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ కూడా మద్దతు పలికారు. అంతేకాదు... దీనిపై ఇటీవల ముంబయిలో ఒక భారీ చర్చావేదికా జరిగింది.
ఈ నేపథ్యంలో అసలు భారత్ వంటి పెద్ద దేశంలో - సంక్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను ఏకకాలంలో నిర్వహించాల్సిన అవసరం - సాధ్యాసాధ్యాలు - లాభనష్టాలు వంటివన్నీ చర్చనీయమే. ఎన్నికలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం కావడం, మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి నెలల తరబడి సమయం పడుతుండడంతో న్యాయ కమిషన్ కూడా గతంలో జమిలి ఎన్నికలు అవసరమని చెప్పింది. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా దీనిపై సిఫారసులు చేసింది.
మొదటి నాలుగు ఎన్నికలూ జమిలిగానే..
* దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన తొలి ఎన్నికలు జమిలిగానే జరిగాయి.
* 1951-52లో తొలిసారి లోక్ సభకు - అన్ని రాష్ర్టాల శాసనసభలు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి.
* అనంతరం 1957 - 1962 - 1967లో ఎన్నికలూ జమిలిగానే నిర్వహించారు.
ఎప్పుడు ఆగిపోయిందంటే..
నాలుగుసార్లు వరుసగా జమిలి ఎన్నికలు జరిగినా 1968లో తొలిసారి దానికి బ్రేక్ పడింది. 1966లో హరియాణా రాష్ర్టం ఏర్పడిన తరువాత 1967లో అన్ని రాష్ర్టాలు - లోక్ సభతో పాటే హరియాణాకూ ఎన్నికలు జరిగినప్పటికీ 1968లో హరియాణా అసెంబ్లీని రద్దు చేశారు. అలాగే 1969లో బిహార్ - పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయడంతో ఆ రెండు ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు మధ్యంతరంగా వచ్చాయి. అనంతరం 1970లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 4వ లోక్ సభను రద్దు చేసి 1971లో మళ్లీ లోక్ సభ ఎన్నికలకు వెళ్లారు. దీంతో 1967తో జమిలి ఎన్నికల పరంపర ముగిసినట్లయింది.
పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏమంది..?
‘సిబ్బంది - ప్రజాఫిర్యాదులు - చట్టం - న్యాయం’పై అప్పటి రాజ్యసభ ఎంపీ సుదర్శన నచియప్పన్ నేతృత్వంలో పనిచేసిన పార్లమెంటరీ స్థాయీసంఘం 2015 డిసెంబరులో ఉభయ సభలకు ఒక నివేదిక సమర్పించింది. అందులో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను కూలంకుషంగా చర్చించింది. అంతేకాదు, దీనిపై చర్చ జరగాలని అభిప్రాయపడుతూ పలు సూచనలు - సిఫారసులు చేసింది.
లాభాలేంటి..?
ఎన్నికల సంస్కరణలకు సంబంధించి న్యాయ కమిషన్ 1999లో ఇచ్చిన నివేదికలో జమిలి ఎన్నికలు ఎందుకు అవసరమో - దాంతో లాభమేంటో చెప్పింది.
* లోక్ సభ - దేశంలోని అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుంది. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో లోక్ సభ - ఆ సమయంలో జరిగిన రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కలిపి ఎన్నికల సంఘానికి రూ.4 వేల కోట్లకు పైగా ఖర్చయింది. ఇక రాజకీయ పార్టీలు - అభ్యర్థులు అంతా చేసిన ఖర్చు లెక్కేస్తే రూ.30 కోట్లు పైమాటే.
* ఎన్నికలొచ్చిన ప్రతిసారీ - ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. నియమావళి అమల్లో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి. ఉదాహరణకు.. 14లో వేర్వేరు రాష్ట్రాల్లో మొత్తం ఏడు నెలలు నియమావళి అమలులో ఉంది. 2015లోనూ అనేక రాష్ర్టాల్లో నియమావళి అమల్లో ఉంది.. ఇలా పదేపదే ఎన్నికలు రావడం అభివృద్ధికి విఘాతమే. అదే, అయిదేళ్లలో ఒకేసారి ఎన్నికలు వస్తే ఆ కొద్దికాలం మాత్రమే నియమావళి అమల్లో ఉంటుంది.
* తరచూ ఎన్నికలు వస్తుంటే ప్రజాజీవితానికీ ఇబ్బందులేర్పడతాయి. రాజకీయ పార్టీల ర్యాలీలు - ప్రచారం కారణంగా శబ్దకాలుష్యం - రహదారులపై రద్దీ వంటి సమస్యలు వస్తాయి. అదే అయిదేళ్లకు ఒకేసారి ఎన్నికలొస్తే కేవలం ఆ కొద్దికాలం మాత్రమే ఈ సమస్య ఎదురవుతుంది. లేదంటే లోక్ సభ ఎన్నికలప్పుడు ఒకసారి - అసెంబ్లీ ఎన్నికలప్పుడు మరోసారి సమస్య తప్పదు.
* అంతేకాదు... ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే మానవ వనరులూ తక్కువేం కాదు. పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు - కేంద్ర బలగాలతో పాటు లక్షలాది మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటారు. కాబట్టి ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇంత పెద్దమొత్తంలో మానవ వనరులను వినియోగించే పనిలేకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే మానవ వనరుల వ్యయాన్ని తగ్గించవచ్చని న్యాయకమిషన్ సూచించింది.
ఇబ్బందులేంటి..
జమిలి ఎన్నికల నిర్వహణలో ఉండే ఇబ్బందులను ఎన్నికల సంఘం ప్రస్తావించింది. అవేంటంటే..
* ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాలు తగినన్ని సమకూర్చుకోవాలి. వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటీ) ఓటింగ్ యంత్రాలు తగినన్ని లేవు. జమిలి ఎన్నికలు నిర్వహించడానికి తగినన్ని సమకూర్చుకోవాలంటే రూ.9,284 కోట్లు అవసరమని 2015లో అంచనా వేసింది. అయితే, ఆ తరువాత కొంతమేర సమకూర్చుకుంది.
* మరోవైపు ఈ యంత్రాలను 15 ఏళ్లకోసారి మార్చాలి. అంటే ప్రతి మూడు ఎన్నికల తరువాత వీవీపీఏటీ యంత్రాలను కొత్తగా కొనుగోలు చేయాలి.
* దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ - అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కోట్లాది ఈవీఎంలను భద్రపరచడానికి ఇప్పుడున్న వేర్ హౌస్ ల సామర్థ్యం చాలదు.
జమిలి ఎన్నికలు నిర్వహిస్తే లోక్ సభ ఎలా ఉండాలి...
జమిలి ఎన్నికలపై నివేదిక ఇచ్చిన పార్లమెంటు స్థాయీ సంఘానికి భారత ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. అవేంటంటే...
* లోక్ సభ టెర్మ్ ప్రారంభమయ్యే - ముగిసే తేదీలను నిర్ణయించుకోవాలి.
* ముందుగా నిర్ణయించుకున్న తేదీ ప్రకారం లోక్‌సభ ఎప్పుడు మొదలవ్వాలో - దాన్ని బట్టి జమిలి ఎన్నికల తేదీలను ఖరారు చేయాలి.
* లోక్ సభ గడువుకు ముందే రద్దయ్యే అవకాశాలు తగ్గించడానికి ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే.. వారే తదుపరి ప్రధానిగా ఎవరు ఉంటారో చెబుతూ వారి పేరిట విశ్వాసం తీర్మానం పెట్టాలి. ఈ రెండు తీర్మానాలకూ సభలో ఒకేసారి ఓటింగ్ జరగాలి. రెండూ ఆమోదం పొందితేనే సభ రద్దయి - ఎన్నికలు అవసరం లేకుండానే కొత్త సభ ఏర్పడుతుంది.
* ఒకవేళ ఏదైనా ఇతర కారణాల వల్ల లోక్ సభ రద్దయ్యే అనివార్య పరిస్థితి వస్తే అప్పుడు పాటించాల్సిన రెండు మార్గాలనూ ఎన్నికల సంఘం సూచించింది.
అవి.. 1) లోక్ సభ రద్దు అనివార్యమై - ఎన్నికలకు కొద్ది సమయమే ఉన్నట్లయితే పాలన పగ్గాలు రాష్ర్టపతి చేపట్టాలి. ఆయనే కొందరు మంత్రులను నియమించుకుని వారి సలహాలతో ప్రభుత్వాన్ని నడపాలి. నిర్ణీత గడువులో కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు కానీ - మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు కానీ అధ్యక్ష పాలన ఉంటుంది.
2) ఒకవేళ సభ రద్దయ్యే నాటికి ఇంకా ఎక్కువ టెర్మే మిగిలి ఉంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కానీ, అప్పుడు ఏర్పడే ప్రభుత్వం అప్పటికి మిగిలి ఉన్న టెర్ము వరకే ఉంటుంది.
* రాష్ట్రాల శాసనసభలకూ ఇదే విధానం వర్తిస్తుంది.