Begin typing your search above and press return to search.

తెలంగాణ లేడీ క‌లెక్ట‌ర్‌... ఏపీ ఆడ‌ప‌డ‌చే!

By:  Tupaki Desk   |   31 Jan 2018 10:35 AM GMT
తెలంగాణ లేడీ క‌లెక్ట‌ర్‌... ఏపీ ఆడ‌ప‌డ‌చే!
X
తెలంగాణ కేడ‌ర్ యువ ఐఏఎస్ అధికారిగా ఆ రాష్ట్రంలోని కీల‌క జిల్లా వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాకు క‌లెక్టర్‌ గా వ్య‌వ‌హ‌రస్తున్న ఆమ్రాపాలీకి నిజంగాన‌రే ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఇటీవ‌లి కాలంలో ఆమె ప‌లుమార్లు వ్య‌వ‌హ‌రించిన తీరు - మారుమూల ప్రాంతాల‌ను - అట‌వీ ప్రాంతాల‌ను చుట్టేసిన వైనం - ఏకంగా ట్రెక్కింగ్‌ లోనూ ఉత్సాహంగా పాలుపంచుకున్న వైనం మ‌న‌కు తెలిసిందే. ఓ లేడీ ఐఏఎస్ అధికారిగా ఉన్న ఆ్ర‌మాపాలి... పురుష అధికారుల‌కు మ‌ల్లే చాలా డేరింగ్ గానే నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని - ప‌నితీరులో పురుషుల‌కు ఆమె ఏమాత్రం తీసిపోర‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. ప‌నితీరులో ఎంతగా రాణిస్తున్న‌... వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఆమ్రాపాలీ వ్య‌వ‌హ‌రించిన తీరుతోనే ఆమె బాగా ప్రాచుర్యం పొందార‌ని చెప్పాలి. ఓ రోజు నిండైన చీర‌లో తెలుగుద‌నం ఉట్టిప‌డేలా క‌నిపించే ఆమ్రాపాలీ... ఆ మ‌రునాడే ఆధునిక‌త‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా క‌నిపించేస్తుంటారు. దీంతో యువ‌త‌లో ఆమెకు మంచి క్రేజ్ ఏర్ప‌డింద‌ని చెప్పాలి. ఐఏఎస్ అధికారిణిగానే కాకుండా ఓ జిల్లాకు క‌లెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమ్రాపాలీకి ఇప్ప‌టిదాకా ఇంకా పెళ్లే కాలేదు. అయితే ఎట్ట‌కేల‌కు ఆమె పెళ్లి ఫిక్స్ అయ్యింద‌న్న వార్త‌లు ఇటీవ‌ల రావ‌డంతో మ‌రోమారు ఆమె వార్తా ప‌త్రిక‌ల్లో ప‌తాక శీర్షిక‌ల్లో క‌నిపించారు.

మొత్తానికి పెళ్లి పుణ్య‌మా అని ఆమ్రాపాలీ కూడా ఓ తెలుగ‌మ్మాయేన‌న్న విష‌యం మ‌న‌కు తెలిసి వ‌చ్చింది. వాస్త‌వానికి ఆమ్రాపాలీని చూసిన వారంతా ఆమెను ఉత్త‌రాదికి చెందిన యువ‌తిగా భావిస్తారు. అయితే ఆమె అచ్చ తెలుగింటి అమ్మాయి అన్న విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీలోని ప్ర‌కాశం జిల్లాకు చెందిన వారుగా ఆమె వివ‌రాలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ వివ‌రాల్లోకి వ‌స్తే... ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్‌.అగ్రహారం గ్రామం. 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌ కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్‌ సాధించి, ఐఏఎస్‌ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆమ్రాపాలీ కుటుంబ స‌భ్యుల వివ‌రాల్లోకెళితే... ఆమ్రాపాలీ సోద‌రి కూడా సివిల్ స‌ర్వెంట్ గానే ప‌నిచేస్తున్నారు. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ ఎస్‌)కు ఎంపికయిన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్‌ లో ఇన్‌ కంట్యాక్స్‌ విభాగంలో పనిచేస్తోంది. మానస గంగోత్రి 2007 ఐఆర్‌ ఎస్‌ బ్యాచ్‌ కు చెందిన అధికారిణి. ఐఆర్‌ ఎస్‌ లో 184వ ర్యాంక్‌ సాధించింది. ఆమె భర్త ప్రవీణ్‌ కుమార్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. తమిళనాడు ఐఏఎస్‌ కేడర్‌ కు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ ప్రస్తుతం ఉమెన్‌ వెల్ఫేర్‌ లో డైరెక్టర్‌ గా చేస్తున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత ఆర్కే న‌గ‌ర్ నియోజ‌కవ‌ర్గానికి జరిగిన ఉప ఎన్నికకు రెండు సార్లు ఆయ‌న‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

ఎన్‌.అగ్రహారానికి చెందిన ఆమ్రాపాలీ తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలోనే జరిగింది. హైస్కూలు విద్య టంగుటూరు, ఇంటర్మీడియేట్ - డిగ్రీ సీఎస్‌ఆర్‌ శర్మ కళాశాలలో, పీజీ విద్య విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్‌ ఫ్రొఫెసర్‌ గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ రీత్యా వెంక‌ట‌రెడ్డి త‌న కుటుంబాన్ని విశాఖ‌కు త‌ర‌లించినా... ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్‌.అగ్రహారంలో ఇప్ప‌టికీ అలాగే ఉంది. ఈ ఇల్లును చూస్తే... నిజంగానే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. ఓ పూరి పాక లాంటి అంత చిన్న ఇంటికి చెందిన కుటుంబంలో నుంచి ఆమ్రాపాలీ వ‌చ్చిందా? అన్న ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. మొత్తానికి పెళ్లి పుణ్య‌మా అని ఆమ్రాపాలీ పూర్తి వివ‌రాలు తెలిసి వ‌చ్చాయ‌న్న మాట‌. అయినా ఆమ్రాపాలీ పెళ్లి చేసుకునే వ్య‌క్తి గురించి చెప్పలేదు క‌దూ. ఆమ్రాపాలీ పెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన నిశ్చయమయింది. ఆమ్రపాలి చేసుకోబోయే వ్యక్తి ఐపీఎస్‌ అధికారి. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన షమీర్‌ శర్మ జమ్మూ పట్టణానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన డయ్యూ–డామన్‌లో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. జమ్మూలో ఫిబ్రవరి 18న వివాహం జరగనుంది. ఫిబ్రవరి 25న సికింద్రాబాద్‌లోని సికింద్రాబాద్‌ క్లబ్‌లో రిసెప్షన్‌ నిర్వహిస్తున్నారు.