Begin typing your search above and press return to search.

ఐటీ గ్రిడ్ గుట్టు ఇదే!... కథ పెద్ద‌దే!

By:  Tupaki Desk   |   6 March 2019 1:48 PM GMT
ఐటీ గ్రిడ్ గుట్టు ఇదే!... కథ పెద్ద‌దే!
X
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అతి పెద్ద వివాదంగా మారిపోయిన డేటా చోరీ విష‌యం.. స‌మ‌యం గ‌డుస్తున్న కొద్దీ అంత‌కంత‌కూ పెద్ద‌దిగా మారిపోతోంది. ఏపీలో విప‌క్షం వైసీపీ చేసిన ఫిర్యాదుతో మొద‌లైన ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ‌లోని అధికార పార్టీ టీఆర్ ఎస్‌ - ఏపీలోని అధికార పార్టీ టీడీపీల మ‌ధ్య బ‌స్తీమే స‌వాల్ గా మారిపోయింది. ఈ కేసు ద‌ర్యాప్తు సాగుతున్న తీరు - ఒక రాష్ట్రంపై మ‌రో రాష్ట్రం పోలీసు కేసులు పెట్టుకునే దిశ‌గా సాగుతున్న వైనం చూస్తుంటే... ఈ వివాదం ఏ పార్టీ కొంప ముంచుతుందోన‌న్న అంశం ఇప్పుడు నిజంగానే వైర‌ల్‌ గా మారిపోయింది. కేసు మూలాలు పెద్ద‌గా మాట్లాడ‌ని టీఆర్ ఎస్‌ - టీడీపీ నేత‌లు... ఒకరిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం మొద‌లైన ఈ కేసు నేడు పోలీసుల ప‌రిధిని దాటి రెండు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ గ‌డ‌ప‌ను కూడా తొక్కేసింది. ఇంత‌లా అంద‌రి నోట నానుతున్న ఈ కేసు అస‌లు గుట్టు ఇప్ప‌టిదాకా ఏ ఒక్క‌రికీ స్ప‌ష్టంగా తెలియ‌ద‌నే చెప్పాలి.

మీడియా సంస్థ‌లు కూడా తాము కొమ్ము కాస్తున్న పార్టీల‌కు అనుకూలంగా ఈ కేసును మ‌లిచేస్తూ వార్త‌లు వండి వారుస్తున్నాయి త‌ప్పించి... కేసు అస‌లు మూలాల్లోకి వెళ్ల‌డం లేదు. అయితే కాసేప‌టి క్రితం ఈ కేసు వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు మీడియా ముందుకు వచ్చిన హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్‌... ఈ కేసు మొత్తం గుట్టును విప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ర‌కంగా ఈ కేసు అస‌లు గుట్టు ఏమిట‌న్న విష‌యం తెలిసిన వారు... చూడ్డానికి అంత‌గా అర్థం కాకుండా సాగుతున్న డేటా చోరీలో ఇంత పెద్ద తతంగం ఉందా? అని నోరెళ్ల‌బెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. స‌రే... ఈ కేసు గుట్టు ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... కేసులో టీడీపీకి సాంకేతిక స‌హ‌కారం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఐటీ గ్రిడ్ సంస్థే ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కీల‌క‌మ‌ని చెప్పాలి. చాలా కాలం క్రితం నుంచే ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీకి అనుబంధంగా ప‌నిచేస్తున్నా...ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో వ‌రుస‌గా కొందరి ఓట్ల గ‌ల్లంతు కావ‌డం -  పోలీసులకు ఫిర్యాదులు చేర‌డంతో ఈ కేసులో ఐటీ గ్రిడ్ ప్ర‌ధాన నిందితురాలిగా నిలబ‌డ‌క త‌ప్ప‌లేదు.

అయినా డేటా చోరీగా పిలుచుకుంటున్న ఈ కేసులో ఐటీ గ్రిడ్ పాత్ర ఏమిటి? అస‌లు ఆ సంస్థ చేస్తున్న త‌తంగం ఏమిటి? ఏం ఆశించి టీడీపీ ఈ సంస్థ‌ను రంగంలోకి దించింది?  టీడీపీ అప్ప‌గించిన ప‌నిని ఈ సంస్థ ఏ రీతిన చ‌క్క‌బెబుతోంది? ఫ‌లితంగా బాధితుల ప‌రిస్థితి ఏమిటి? అన్న స‌మ‌గ్ర వివ‌రాల‌ను తెలియ‌జేసేందుకు హైద‌రాబాద్ పోలీసులు గీసిన ఓ డ‌యాగ్ర‌మ్ ఇప్పుడు ఈ గుట్టు మొత్తాన్ని విప్పేసింద‌ని చెప్పాలి. ఈ డ‌యాగ్ర‌మ్ ప్ర‌కారం... టీడీపీ సేవా మిత్ర పేరిట ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను అభివృద్ధి చేసిన సంస్థ కూడా ఐటీ గ్రిడ్డే. ఈ యాప్ ద్వారా ఓట‌ర్ల‌కు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌రాల‌ను సేక‌రించ‌డంతో పాటుగా ఆ వివ‌రాల‌ను భ‌ద్ర‌ప‌రచ‌డం - అవ‌స‌ర‌మైన డేటాను టీడీపీకి పంపడం - టీడీపీ ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఓట‌ర్లను విచారించ‌డం - వారికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను సేక‌రించ‌డం - తిరిగి ఆ స‌మాచారాన్ని టీడీపీకి పంప‌డం - పార్టీలో ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన కీల‌క వ్య‌క్తి ఇచ్చే ఆదేశాల మేర‌కు... అంతిమంగా మ‌రో ఓట‌రు జాబితాను చేతిలో పెట్టుకున్న వ్య‌క్తికి ఈ స‌మాచారాన్ని పంప‌డం... ఇవీ ఐటీ గ్రిడ్ ప్ర‌ధాన విధులు.

ఈ వ‌రుస క్ర‌మం ఎలా సాగుతుంద‌న్న విష‌యానికి వ‌స్తే... సేవా మిత్ర యాప్‌ తో అనుసంధానం అయి ఉన్న టీడీపీ బూత్ లెవెల్‌ సేవా మిత్ర క‌న్వీన‌ర్ నుంచి కొంత స‌మాచారం ముందుగా ఐటీ గ్రిడ్‌కు చేరుతుంది. ఆ స‌మాచారంలోని వ్య‌క్తుల‌ను ఫోన్ ద్వారా ప‌ల‌కరించి ఆయా వ్య‌క్తులకు సంబంధించి మ‌రిన్ని స‌మ‌గ్ర వివ‌రాల‌ను ఐటీ గ్రిడ్ సేక‌రిస్తుంది. ఈ సంద‌ర్భంగా స‌ద‌రు వ్య‌క్తుల‌కు సంధించే ప్ర‌శ్నావ‌ళితో రానున్న ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ఓటేస్తార‌న్న కీల‌క ప్ర‌శ్న కూడా ఉంటుంది. ఈ స‌ర్వే ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే...బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర క‌న్వీన‌ర్ ఇచ్చిన స‌మాచారంతో పాటుగా త‌న స‌ర్వేలో సేక‌రించిన వివ‌రాల‌ను జోడించిన స‌మాచారాన్ని ఐటీ గ్రిడ్... టీడీపీకి పంపుతుంది. ఈ స‌మాచారాన్ని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి పంప‌డంతో పాటుగా త‌న‌కు ఎవ‌రైతే ప్రాథ‌మిక వివ‌రాలు అందించారో స‌ద‌రు బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర క‌న్వీన‌ర్ కు కూడా ఐటీ గ్రిడ్ పంపుతుంది. ఈ వివ‌రాల‌ను చేత‌బ‌ట్టుకుని కార్య‌రంగంలోకి దిగే బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర క‌న్వీన‌ర్.. తాను ఎంచుకున్న వ్య‌క్తుల నుంచి ఆధార్ - ఓట‌రు ఐడీ - ఫోన్ నెంబ‌రు త‌దిత‌ర వివ‌రాల‌ను సేక‌రిస్తారు.

ఈ సేక‌ర‌ణ‌లో స‌ద‌రు ఓట‌రు సామాజిక వ‌ర్గం వివ‌రాలు కూడా సేక‌రిస్తార‌ట‌. ఆ త‌ర్వాత ఈ వివ‌రాల‌ను బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర క‌న్వీన‌ర్ తిరిగి ఐటీ గ్రిడ్‌ కు పంపుతారు. ఈ మొత్తం స‌మాచారాన్ని క్రోడిక‌రించిన త‌ర్వాత ఐటీ గ్రిడ్ స‌మ‌గ్ర డేటాను టీడీపీలోని కీల‌క స్థానంలో కూర్చున్న వ్య‌క్తికి పంపుతుంది. దీనిని ప‌రిశీలించిన త‌ర్వ‌త స‌ద‌రు ఓట‌రు ఈ ద‌ఫా త‌మ‌కు ఓటేయ‌ర‌ని నిర్ధారించే స‌ద‌రు కీల‌క నేత ఓట‌రు జాబితాతో ఎళ్లవేళలా సిద్ధంగా ఉండే అధికారికి పంపుతారు. ఇక అంతే... స‌ద‌రు ఓట‌రు పేరు ఓట‌రు జాబితా నుంచి డిలీట్ అయిపోతుంది. ఇదీ మొత్తంగా ఐటీ గ్రిడ్ కేంద్రంగా జ‌రుగుతున్న తంతుగా భావిస్తున్నారు. అంటే బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర క‌న్వీన‌ర్ వ‌ద్ద నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ తంతు ఐటీ గ్రిడ్ కేంద్రంగా ప‌లు మార్గాల్లో ప‌లు విశ్లేష‌ణ‌ల త‌ర్వాత పార్టీలో కీల‌క వ్య‌క్తిగా ఉన్న నేత‌కు చేరుతుంద‌న్న మాట‌. త‌మకు ఓటేస్తార‌ని భావించే ఓట‌రుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు గానీ... త‌మ‌కు ఓటేయ‌ర‌ని భావించే వారి ఓట్లు మాత్రం అప్ప‌టిక‌ప్పుడు గ‌ల్లంతైపోతున్నాయ‌న్న మాట‌. డేటా చోరీ అంటూ ఓ నాలుగు అక్ష‌రాల రెండు ప‌దాల‌తో కూడిన ఈ వివాదంలో ఇంత పెద్ద త‌తంగం న‌డుస్తోంద‌న్న మాట‌.