Begin typing your search above and press return to search.

ట్రంప్ టూర్ పై కామ్రేడ్ల గుస్స.. గోబ్యాక్ అంటూ ఆందోళనలు

By:  Tupaki Desk   |   25 Feb 2020 10:12 AM GMT
ట్రంప్ టూర్ పై కామ్రేడ్ల గుస్స.. గోబ్యాక్ అంటూ ఆందోళనలు
X
ప్రపంచ ప్రజల ప్రధాన శత్రువు అమెరికా, అమెరికా సామ్రాజ్యవాదం పాటిస్తూ ఇతర దేశాలపై పెత్తనం చెలాయిస్తోందని ఆరోపిస్తూ కమ్యూనిస్టులు ఆందోళన చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ గో బ్యాంక్ ట్రంప్ అంటూ సీపీఐ, ఎస్ యూసీఐ (కమ్యూనిస్టు) పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కామ్రేడ్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ బేగంపటేలోని అమెరికన్ కాన్సులెట్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కార్యాలయం లోపలకు వెళ్లేందుకు యత్నించిన సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గో బ్యాక్ గో బ్యాక్ ట్రంప్, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని తదితర నినాదాలతో హోరెత్తించారు.

కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని రసూల్ పు చౌరస్తా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ కాన్సులెట్ కార్యలయం వద్ద పోలీసులు భారీగా మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రంప్ పర్యటనను బహిష్కరించాలని, ట్రంప్ వెనక్కి వెళ్లాలని కోరుతూ సీపీఐతో పాటు ఎస్ యూసీఐ (కమ్యూనిస్టు) పార్టీ నాయకులు పోస్టర్లు ముద్రించి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాస్వామ్య వాదులు కూడా వారికి మద్దతుగా నిలుస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ట్రంప్ వైఖరితో ప్రపంచంలో సామ్రాజ్యవాదం పెట్రేగిపోతోందని కమ్యూనిస్టు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ ఆయుధ సామగ్రిని పెంచుకుని యుద్ధన్మోదం పెంచుతున్నారని, భయానక పరిస్థితులు సృష్టిస్తున్నాడని చెబుతూ ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు.