Begin typing your search above and press return to search.

వారి కటాక్షం కోసం అవస్థలు

By:  Tupaki Desk   |   4 Feb 2022 5:39 AM GMT
వారి కటాక్షం కోసం అవస్థలు
X
మొదటి దశ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ఈనెల 10వ తేదీన జరగబోతోంది. దీంతో వివిధ సామాజిక వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు నానా అవస్థలు పడుతున్నాయి. మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్నా అధికారం నిలుపుకోవాలని అనుకుంటున్న బీజేపీ, ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఎస్పీల్లో ఈ టెన్షన్ మరింతగా పెరిగిపోతోంది.

వివిధ సామాజికవర్గాలతో పాటు ఎక్కువగా కుర్మీలపైన పార్టీలు దృష్టి పెట్టాయి. యూపీ జనాభాలో కుర్మీల జనాభా 5 శాతం. 5 శాతమంటే మామూలు విషయం కాదు. జనాభా పరంగా చూసుకుంటే ఓబీసీల్లో యాదవుల తర్వాత కుర్మీలదే రెండో స్థానం. కుర్మీ సామాజికవర్గంలో పట్టున్న నరేష్ ఉత్తమ్ పటేల్ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు బాగా సన్నిహితుడు. అందుకనే ఎస్పీ తరపున ఉత్తమ్ పటేల్ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. కుర్మీల ఓటు బ్యాంకును ఎస్పీకి అనుకూలంగా మలచేందుకు బాగా కష్టపడుతున్నారు.

ఇదే సమయంలో బీజేపీ కూడా అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్ కు ప్రాధాన్యతిస్తోంది. కుర్మీల ఓట్ల కోసమే అనుప్రియాను నరేంద్రమోడి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్నాదళ్ వ్యవస్థాపకుడు సోనేలాల్ పటేల్ ఉన్నంతవరకు కుర్మీలు ఏకతాటిపైనే ఉండేవారు. ఎప్పుడైతే సోనేలాల్ మరణించారో భార్య కృష్ణపటేల్, కూతురు అనుప్రియ మధ్య గొడవలు మొదలయ్యాయి. పార్టీలో చీలిక వచ్చి విడిపోయారు. దాంతో కుర్మీ నేతలు, జనాల్లో కూడా చీలిక వచ్చేసింది.

అనుప్రియ బీజేపీతో ఉంటే తల్లి కృష్ణ పటేల్ ఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. 2017 ఎన్నికల్లో కుర్మీల్లో మెజారిటి ఓట్లు బీజేపీకే పడినా తర్వాత తేడా వచ్చేసింది. అందుకనే రాబోయే ఎన్నికల్లో కుర్మీల ఓట్లను ఆకర్షించేందుకు కొన్ని ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గానికే పోటీలు పడి బీజేపీ, ఎస్పీలు టికెట్లిచ్చాయి. దాదాపు 8 లోక్ సభ, 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుర్మీలదే డిసైడింగ్ ఫ్యాక్టర్. కబీర్ నగర్, మిర్జాపూర్, బరేలీ, ఫతేపూర్, ప్రతాప్ గఢ్, కౌశాంబి, అలహాబాద్, బలరాంపూర్ లాంటి జిల్లాల్లో కుర్మీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మరి కుర్మీలు ఎవరిని కటాక్షిస్తారో చూడాలి.