Begin typing your search above and press return to search.

టార్గెట్ చేసి మరీ చంపేస్తున్నారు

By:  Tupaki Desk   |   2 Dec 2021 12:30 PM GMT
టార్గెట్ చేసి మరీ చంపేస్తున్నారు
X
ఆఫ్ఘనిస్ధాన్లో పరిస్దితులు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. ఒకవైపు ఆకలిమంటలతో మామూలు జనాల్లో కొందరు చనిపోతున్నారు. మరికొందరు తాలిబన్ల పాలనపై నిరసన తెలుపుతు కాల్పులకు లేదా ఉరికంబానికి వేలాడుతున్నారు. ఇదంతా మామూలు జనాల విషయంలో తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరుకు ఉదాహరణలు. అయితే తాజాగా హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్ధ తెలిపిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ హ్యూమన్ రైట్స్ వాచ్ ఏమి చెబుతోందంటే కొందరిని తాలిబన్లు వెంటాడి, వేటాడి మరీ చంపుతున్నారట.

తాలిబన్లు దేశాన్ని కబ్జా చేయకముందు పోలీసు అధికారులుగా మిలిటరీలో పనిచేసిన వారు ఎంతుమందున్నారు. వీరంతా అప్పటి ప్రభుత్వం+ అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనల ఆధీనంలో పనిచేశారు. అప్పట్లో తాలిబన్లపై సంకీర్ణ సేనలు రెగ్యులర్ గా దాడులు చేసి హతమార్చేవి. ఇపుడు దేశం మొత్తం తాలిబన్ల చేతికి వచ్చిన తర్వాత అప్పట్లో తమపై దాడులు చేయటానికి కారకులైన వారిని ఇపుడు వేటాడుతున్నారట.

తమపై దాడులకు కారణాలుగా గుర్తించిన వారిని తాలిబన్లు ఇపుడు వేటాడుతున్నారు. ఇల్లిల్లు తిరిగి మరీ గాలిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వ రికార్డుల్లోని అడ్రస్ ల ప్రకారం పోలీసు, మిలిటరీ అధికారులను వేటాడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 100 మందిని గుర్తించి అదుపులోకి తీసుకుని తాలిబన్లు చంపేశారట. ఆగష్టు 15వ తేదీ నుండి అక్టోబర్ 31 మధ్యలో నాలుగు ప్రావిన్సుల్లో కలిపి 47 మంది మాజీ సైనికులు, 53 మంది మాజీ పోలీసులను తాలిబన్లు చంపేశారు.

అప్పట్లో తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిగురించి తాలిబన్లు దేశమంతా వెతుకుతున్నారు. అంటే వీళ్ళ టార్గెట్లో ఇంకా ఎన్ని వందలమంది ఉన్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. దేశాన్ని ఆక్రమించుకున్న కొత్తల్లో తమ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణహానీ ఉండదని ప్రకటించారు. కానీ జరుగుతున్నది మాత్రం వేరు. అంటే అంతర్జాతీయ సమాజం కోసం ప్రకటనలు చేస్తున్న తాలిబన్లు లోలోపల మాత్రం తమ నిజస్వరూపాన్ని చూపిస్తున్నారు.

ఇప్పటికే తమకు ఎదురుతిరిగిన మామూలు జనాలను నడిరోడ్డుపై కాల్చి చంపేయటమో లేకపోతే ఉరివేయటమో చేసేస్తున్నారు. అంటే జనాలను భయాందోళనలకు గురిచేసి తమ గుప్పిట్లో ఉంచుకోవాలని తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఆఫ్ఘన్లో ఈ అరాచకపాలన ఇంకా ఎంతకాలం నడుస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. వీళ్ళ పాలనకు ముగింపు పడేవరకు ఇలాంటి హత్యలు, దారుణాలు జరుగుతునే ఉంటాయి.