Begin typing your search above and press return to search.

టికెట్ల‌కు కాంగ్రెస్ కండీష‌న్లు ఇవేన‌ట‌!

By:  Tupaki Desk   |   7 Oct 2018 5:07 AM GMT
టికెట్ల‌కు కాంగ్రెస్ కండీష‌న్లు ఇవేన‌ట‌!
X
అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అభ్య‌ర్తుల ఖ‌రారు అంశం పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గుతోంది. ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా పార్టీ టికెట్ల కోసం డిమాండ్ ఉండ‌టం చూస్తే.. కేసీఆర్ కు ప్ర‌తికూలంగా గాలి వీస్తుందా? అన్న సందేహం క‌లిగేలా ఉంద‌న్న మాట కాంగ్రెస్ నేత‌ల నోట్లో నుంచి వినిపిస్తోంది. ఇంత‌కీ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఎలా జ‌రుగుతుంది? ఏ వ్యూహాన్ని అమ‌లు చేస్తార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఒకే జాబితాలో మొత్తం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని డిసైడ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్ర‌మే ఇవ్వాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. గెలుపు మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని.. పార్టీ ప‌ట్ల అంతులేని విధేయ‌త ఉన్న వారికే టికెట్లు కేటాయించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఖ‌ర్చు విష‌యంలోనూ అభ్య‌ర్థులు ఎవ‌రికి వారు ఏమేం చేసుకోవాలో వాటిపై అవగాహ‌న ఉన్న వారికి.. ఎవ‌రి మీదా ఆధార‌ప‌డ‌కుండా ఉండే వారికి టికెట్ల కేటాయింపులో అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి టాప్ త్రీ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసి.. ఆ జాబితాను అధినాయ‌క‌త్వానికి అంద‌జేశారు.

రెండుసార్లు ఓడిపోయిన వారు.. గ‌త ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కోల్పోయిన వారికి ఈసారి పోటీలోకి దిగేందుకు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న మాట చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. ఫైన‌ల్ గా టికెట్ల కేటాయింపులో మాట‌ల‌కు త‌గ్గ‌ట్లుగా చేత‌లు ఉంటాయా? ఎప్ప‌టి మాదిరే కాంగ్రెస్ మార్క్ అభ్య‌ర్థుల జాబితా ఉంటుందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రం. అభ్య‌ర్థుల జాబితా స‌స్పెన్స్ వీడాలంటే మ‌రికొంత కాలం వెయిట్ చేయక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి.