Begin typing your search above and press return to search.

పావ‌లా కోసం తీసేసిన జాబ్‌ ను ఇవ్వ‌మ‌న్నారు

By:  Tupaki Desk   |   6 May 2017 6:18 AM GMT
పావ‌లా కోసం తీసేసిన జాబ్‌ ను ఇవ్వ‌మ‌న్నారు
X
ఇవాల్టి రోజుల్లో రూపాయికి ఏ మాత్రం విలువ లేదు. రూపాయి బిళ్ల షాపు వాడికి ఇస్తే.. దాంతో చాలానే వ‌స్తువులు రాని దుస్థితి. ఇక‌.. రూపాయికంటే త‌క్కువైన అర్థ‌రూపాయి.. పావ‌లా (25 పైస‌లు) లాంటి నాణెలు అయితే వాడుక‌లోనే లేవు. గ‌డిచిన కొన్నేళ్లుగా పావ‌లా.. అర్థ రూపాయి లాంటివి వినియోగంలోనే లేవు. అయితే.. ఇదే పావ‌లా కోసం దాదాపు 23 ఏళ్ల క్రితం ఒక కండక్ట‌ర్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై పోరాడుతున్న ఆయ‌న‌కు ఉద్యోగం ఇవ్వాల‌ని.. ఇంత‌కాలం ఆయ‌న‌కు జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారం ఇవ్వాలంటూ పారిశ్రామిక ట్రిబ్యున‌ల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్ని అమ‌లు చేయాలని.. స‌ద‌రు కండ‌క్ట‌ర్‌ ను ఉద్యోగంలోకి తీసుకోవాలని.. అత‌డికి చెల్లించాల్సిన పెండింగ్ బ‌కాయిల్ని వెంట‌నే చెల్లించాలంటూ సింగిల్ జ‌డ్జి తాజాగా తీర్పును ఇచ్చారు.

పావ‌లా కోసం ఉద్యోగం పోగ్గొట్టుకొని.. సుదీర్ఘ న్యాయ‌పోరాటం త‌ర్వాత తిరిగి జాబ్ ను సాధించుకున్న కండ‌క్ట‌ర్ వివాదాన్ని చూస్తే..

చార్మినార్ - ఫ‌తేద‌ర్వాజ రూట్లో న‌డిచే బ‌స్సులో ఎంఎల్ అలీ కండ‌క్ట‌ర్ గా బాధ్య‌తలు నిర్వ‌ర్తిస్తున్నాడు. 1993 అక్టోబరు 27న ఆర్టీసీ ఎన్ ఫోర్స్ మెంట్ స్క్వాడ్ అధికారులు బ‌స్సులో త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఒక‌రి ద‌గ్గ‌ర 50 పైస‌లు తీసుకొని 75 పైస‌ల టికెట్ ఇవ్వ‌లేద‌ని.. మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు టికెట్ లేకుండా ప్ర‌యాణిస్తున్నార‌ని గుర్తించారు. బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తున్న కండ‌క్ట‌ర్ పైన చ‌ర్య‌లు తీసుకుంటూ అత‌న్ని ఉద్యోగం నుంచి తొల‌గించారు.

ఈ ఉదంతంపై న్యాయ‌పోరాటానికి దిగారు అలీ. 75 పైస‌ల టికెట్ కు 50 పైస‌లు మాత్ర‌మే ఇచ్చిన ప్ర‌యాణికుడి నుంచి మిగిలిన పావ‌లా గురించి అడుగుతున్న స‌మ‌యంలోనే త‌నిఖీలు జ‌రిగాయ‌ని.. ఆ సంద‌ర్భంగా కండ‌క్ట‌ర్ చెప్పిన మాట‌ల్ని స‌ద‌రు అధికారులు విన‌లేద‌ని కోర్టు త‌ప్పు ప‌ట్టింది. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు టికెట్లు ఇచ్చే లోపే అధికారులు త‌నిఖీలు చేప‌ట్టార‌ని.. ఇందులో కండక్ట‌ర్ త‌ప్పు చేయ‌లేద‌ని తేల్చిన కోర్టు.. ఉద్యోగం కోల్పోయిన అలీకి జాబ్ తిరిగి ఇవ్వాల‌ని.. ఇంత‌కాలం ఆయ‌న‌కు అందాల్సిన ప‌రిహారాన్ని ఇవ్వాల‌ని ఆదేశించింది. అప్పుడెప్పుడో పావ‌లా కోసం ఉద్యోగ‌మే పోయింద‌న్న మాట ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. విస్మ‌యాన్ని రేకెత్తించేదిగా ఉంద‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/