Begin typing your search above and press return to search.

కోన్ ఐస్ క్రీం కేవలం రూ.2.. ఎక్కడ.. అయినా లాభాలొస్తున్నాయట

By:  Tupaki Desk   |   30 May 2022 12:30 AM GMT
కోన్ ఐస్ క్రీం కేవలం రూ.2.. ఎక్కడ.. అయినా లాభాలొస్తున్నాయట
X
రూపాయికే ఇడ్లీ అమ్మే బామ్మ గురించి తెలిసిందే. ఆకలి తీర్చే ఈ బామ్మ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవటం తెలిసిందే. అయితే.. తన తండ్రి మొదలెట్టిన వ్యాపారాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తూ.. ఖర్చు పెరిగిపోయినప్పటికీ సెంటిమెంట్ తో కేవలం రూ.2కే కోన్ ఐస్ క్రీం ఇచ్చే ఈ అన్న రోటీన్ కు భిన్నం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట మార్కెట్లో రూ.20విలువ చేసే ఐస్ క్రీంను కేవలం రూ.2కే అందించే ఈ స్టోర్ గురించి తెలుసుకోవాల్సిందే.

ఐస్ క్రీం అన్నంతనే చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా మనసు పడిపోతుంటారు. ఇక.. వేసవిలో ఐస్ క్రీంకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. చల్లని కోన్ ఐస్ క్రీంను కేవలం రూ.2కే అందించే ఐస్ క్రీం పార్లర్ కేరాఫ్ అడ్రస్ చెన్నై.

ఈ మహాపట్టణంలోని ఈ పార్లర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారు? దీనికి కారణం ఏమిటి? రూ.2లకే కోన్ ఐస్ క్రీం అంటే క్వాలిటీ ఉంటుందా? అన్న సందేహం కలగొచ్చు. వాటికి సమాధానాలు వెతికితే.. చెన్నైలోని మాంబలం ప్రాంతంలో 1995లో వినూ ఇగ్గూ పేరుతో ఐస్ క్రీం పార్లర్ ఒకటి ఓపెన్ అయ్యింది.

ఆ రోజుల్లో కోన్ ఐస్ క్రీంను కేవలం రూ.2కే అమ్మారు. దీంతో ఆ పార్లర్ ఆ ప్రాంతంలో క్లిక్ కావటమే కాదు.. పెద్ద ెత్తున వచ్చేవారు. అయితే.. 2008లో ఈ ఐస్ క్రీం పార్లర్ ను మూసేశారు.దీంతో.. రూ.2లకే కోన్ ఐస్ క్రీం అందించే పార్లర్ ప్రజలకు దూరమైంది. కట్ చేస్తే.. తాజాగా 2022 ఫిబ్రవరిలో ఈ పార్లర్ మళ్లీ ఓపెన్ అయ్యింది.

ప్రారంభ ఆఫర్ కింద తన తండ్రి చేసినట్లే కోన్ ఐస్ క్రీంను రూ.2లకే అమ్మారు వినోద్. అయితే.. తమ పార్లర్ కు పాత కస్టమర్లు గుర్తు పెట్టుకొని రావటమే కాదు.. తమ భావోద్వేగాన్ని అతడితో పంచుకోవటంతో.. తన తండ్రి స్టార్ట్ చేసిన రూ.2లకే కోన్ ఐస్ క్రీంను కంటిన్యూ చేయాలని డిసైడ్ చేశాడు.

రూ.2లకే కోన్ ఐస్ క్రీం సోషల్ మీడియాలో వైరల్ కావటం.. దాని కోసం పెద్ద ఎత్తున రావటంతో దాని ధర మార్చకూడదని డిసైడ్ అయ్యాడు వినోద్. మరీ అంత తక్కువ ధరకు ఐస్ క్రీం ఇస్తున్నారు.. క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారా? అంటే నో అని స్పష్టంగా చెబుతాడు. పాలతో తయారు చేసే తమ ఐస్ క్రీంను నాణ్యతతో తయారు చేస్తామని చెబుతున్నాడు.

మరి.. ఇంత తక్కువ ధరకు అమ్మితే నష్టం రాదా? అంటే.. తన తండ్రి సెంటిమెంట్ ను కొనసాగించాలని నిర్ణయించుకున్నామని.. లాభనష్టాల విషయానికి వస్తే.. పార్లర్ కు వచ్చే వారు రూ.2 కోన్ ఐస్ క్రీం తిన్న తర్వాత.. మిగిలిన వస్తువుల్ని కొనుగోలు చేయటం వల్ల ఆ నష్టం.. వాటిలో భర్తీ అవుతుందని.. తన తండ్రి సెంటిమెంట్ ను కంటిన్యూ చేశామన్న సంతృప్తి చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. ధరలు మండిపోతున్న వేళ.. రూ.2లకే కోన్ ఐస్ క్రీం అందిస్తున్న వినూ ఇగ్గూ పార్లర్ అలానే సాగాలని కోరుకుందాం. వీలైతే.. చెన్నై వెళ్లినప్పుడు ఒకసారి ట్రై చేయండి.