Begin typing your search above and press return to search.

అధికారలకు అముల్ తెచ్చిన తంటా

By:  Tupaki Desk   |   8 Oct 2021 6:42 AM GMT
అధికారలకు అముల్ తెచ్చిన తంటా
X
ప్రభుత్వం ఏ పని చేసినా కాస్త ముందు వెనకా ఆలోచించి చేయాలి. అలా కాకుండా అనాలోచితంగా ఏది పడితే అలా వ్యవహరిస్తామంటే చివరకు అభాసు పాలవ్వడం తప్పదు. ఇదంతా ఇపుడు ఎందుకంటే గుంటూరు జిల్లాలో 12 మంది పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయితీ అధికారి నోటీసులివ్వటం గురించే. చూడ్డానికి పైకి ఇది చిన్న విషయంగానే కనిపిస్తున్నా నాలుగు రోజులు ఇలాగే ఉంటే మాత్రం చాలా పెద్ద వివాదంగా మారే అవకాశం స్పష్టంగా కనబడుతోంది

గుంటూరు జిల్లాలో పాల సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీపీవో 12 మంది పంచాయితి కార్యదర్శలకు నోటీసులివ్వటం జిల్లాలో కలకలం రేపుతోంది. పాడిరైతులు పాలు పోయకపోతే తాము కారణం ఎలాగవుతామంటు పంచాయితి కార్యదర్శులు నెత్తీ నోరు మొత్తుకంటున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పంచాయితి కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ మాట్లాడుతూ అముల్ పాల సేకరణ నిజానికి తమ బాధ్యత కాదన్నారు. తమ బాధ్యత కాకపోయినా ప్రభుత్వం చెప్పిందికదాని అముల్ కు పాలుపోసేట్లుగా రైతులను చైతన్య పరిచేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు.

తమ బాధ్యతలను తాము సక్రమంగా నిర్వహిస్తున్నా అముల్ కు రైతులు పాలుపోయకపోతే తామేం చేయగలమని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమ బాధ్యతల్లో తాము విఫలమైనట్లు చెబుతు 12 మంది పంచాయితి కార్యదర్శులకు నోటీసులివ్వటంపై ప్రసాద్ మండిపోయారు. అసలు పంచాయితి కార్యదర్శుల బాధ్యతలు ఏమిటి ? విధులేమిటి ? అనే విషయంలో బాగా అయోమయంగా ఉందంటు బాధపడిపోయారు. తమ కార్యదర్శులకు ఇచ్చిన నోటీసులను వెంటనే డీపీవోలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయటంలో తప్పేలేదు.

ఇక్కడో సమస్యుంది. అదేమిటంటే జిల్లాలో అముల్ రాకముందే సంఘం డైరీ దశాబ్దాలుగా పాతుకుపోయుంది. పాలసేకరణకు ఎవరెంత రేటు ఇస్తున్నారు అనే విషయాన్ని పక్కనపెట్టేస్తే దశాబ్దాలుగా రైతులతో సంఘం డైరీకి గట్టి అనుబంధమే ఉంది. సంఘం డైరీని కాదని చివరకు చంద్రబాబునాయడు సొంత డైరీ హెరిటేజ్ కూడా ఏమీ చేయలేకపోయింది. సంఘం డైరీ టీడీపీ నేత దూళిపాళ్ళ నరేంద్రచౌదరి చేతిలో ఉంది. బహశా సంఘం డైరీ కారణంగానే రైతులు ఆశించినంతగా అముల్ వైపు రావటం లేదేమో.

ఏ డైరీకి రైతులు పాలుపోయాలన్నా సేకరణ ధర, ఎన్నిరోజుల్లో చెల్లింపులు చేస్తున్నారు అనే విషయం చాలా కీలకం. ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా రైతులు అముల్ కు పాలుపోయటంలేదని పంచాయితి కార్యదర్శులకు నోటీసులిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. అవసరమైతే అముల్ అధికారులనో లేకపోతే ప్రభుత్వ ఉన్నతాధికారులనో పంపించి పాడిరైతులతో నేరుగా మాట్లాడించాలంతే. అంతేకానీ మధ్యలో కార్యదర్శులకు నోటీసులిస్తే రైతులు పాలుపోస్తారా ? అనాలోచితంగా చేసే ఇలాంటి పనులే చివరకు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని గ్రహించకపోతే కష్టమే.