Begin typing your search above and press return to search.

దీపావళి సెలవుల లొల్లి.. కాల్పులు జరుపుకున్న జవాన్లు.. నలుగురు మృతి

By:  Tupaki Desk   |   8 Nov 2021 4:58 AM GMT
దీపావళి సెలవుల లొల్లి.. కాల్పులు జరుపుకున్న జవాన్లు.. నలుగురు మృతి
X
క్రమశిక్షణకు మారుపేరుగా అభివర్ణించే జవాన్ల మధ్య ఒక చిన్న విషయం మీద మొదలైన గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. చివరకు నలుగురు జవాన్లు మృతి చెందిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతం ఎంతకూ జీర్ణం కాని రీతిలో ఉండటం గమనార్హం. దీపావళి సెలవుల విషయంలో మొదలైన గొడవ.. పెరిగి పెద్దది కావటమే కాదు.. ప్రత్యర్థులు.. నేరస్తుల అంతం చూసేందుకు వాడాల్సిన రివాల్వర్లను.. తమ తోటి జవాన్ల మీద ఉపయోగించిన వైనం సంచలనంగా మారింది.

తాజా ఉదంతంలో నలుగురు జవాన్లు మృతి చెందటం గమనార్హం. తెలంగాణ - ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఛత్తీస్గఢ్ లోని సుకుమా జిల్లా పరిధి లింగంపల్లి బేస్ క్యాంప్ లో ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున జవాన్ల మధ్య వివాదం మొదలైంది.

సెలవుల విషయంలో మొదలైన గొడవ అంతకంతకూ ఎక్కవైంది. చివరకు తీవ్ర ఆవేశానికి గురైన జవాన్లు.. తమ వద్ద ఉన్న ఆయుధాల్ని.. సహచరులకు గురి పెట్టటమే కాదు.. విచక్షణారహితంగా కాల్పులు సైతం వెనుకాడని వైనం ఇప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ కాల్పుల్లో బిహార్ కు చెందిన రాజమణి యాదవ్.. డంజి.. బెంగాల్ కు చెందిన రాజుమండల్ అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.

సీఆర్ఫీఎఫ్ 50వ బెటాలియన్ కు చెందిన ఒక జవాన్ తన తోటి జవాన్ మీద విచక్షణారహితంగా కాల్పులు చేయటం మొదలు పెట్టిన తర్వాత.. జవాన్లు ఒకరిపై మరొకరు కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్లుగా చెబుతున్నారు. సుక్కా జిల్లా మారాయి గూడెం పోలీసు స్టేషన్ పరిధిలోని బేస్ క్యాంప్ లో ఈ దారుణ ఉదంతం చోటు చేసుకుంది.

గాయాలైన జవాన్లను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరో జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఉదంతంపై సీనియర్ అధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతర్గత విచారణకు ఆదేశించటంతో పాటు.. కాల్పుల ఉదంతంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణను మొదలు పెట్టారు.