Begin typing your search above and press return to search.

కొట్టుకోండి.. మాక్కావాల్సింది అదే!

By:  Tupaki Desk   |   19 Nov 2021 3:52 AM GMT
కొట్టుకోండి.. మాక్కావాల్సింది అదే!
X
ఏ రాజ‌కీయ పార్టీ అయినా త‌మ ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేస్తాయి. అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ప‌రామావ‌ధిగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తాయి. ఆందోళ‌న‌లు చేప‌ట్టినా.. దాడులు చేసినా.. నిర‌స‌న వ్య‌క్త‌ప‌రిచినా.. వాట‌న్నింటి వెన‌క ఉంది ఒకే కార‌ణం. అదే గ‌ద్దెనెక్క‌డం. ఇప్ప‌టికే కుర్చీలో ఉన్న నాయ‌కులు దాన్ని కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే.. ప్ర‌త్య‌ర్థి నేత‌లు ఎప్పుడెప్పుడూ ఆ కుర్చీ సొంతం చేసుకుందామా అని ఎదురు చూస్తుంటారు.

ఇదే రాజ‌కీయ ప‌ర‌మార్థం. అందుకోసం పార్టీలు దేనికైనా వెన‌కాడ‌వు. చివ‌ర‌కు త‌మ‌నే న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల‌నూ బ‌లి ప‌శువులు చేసేందుకూ సిద్ధ‌మ‌వుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప‌రిస్థితి చూస్తే అదే నిజం అనిపిస్తోంది. బండి సంజ‌య్ జిల్లాల యాత్ర సంద‌ర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మ‌ధ్య దాడులే అందుకు నిద‌ర్శ‌నం.

హ‌ద్దు మీరుతోంది..

అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయ పోరు ఎప్పుడూ ఉంటుంది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ అధికార పార్టీ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌ప్పుప‌ట్ట‌డం సాధార‌ణ‌మే. అందుకు ఆందోళ‌న‌లు చేయ‌డం.. నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేయ‌డం తెలిసిందే. ప్ర‌తిప‌క్ష పార్టీ విమ‌ర్శ‌ల‌కు అధికార పార్టీ కూడా స‌మ‌ర్థంగానే బ‌దులిస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణ‌లో అధికార పార్టీ మాట‌లు దాటి దాడుల‌కు ఉసి గొల్పుతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఆ పార్టీ ఓట‌మి త‌ర్వాత మారిన స‌మీక‌ర‌ణాలు.. బీజేపీ నుంచి వ‌స్తున్న తీవ్ర విమ‌ర్శ‌ల‌తో టీఆర్ఎస్ బాస్ కేసీఆర్‌కు ఫ్ర‌స్టేష‌న్ పెరిగిపోయింద‌ని చెబుతున్నారు. అందుకే ధాన్యం కొనుగోళ్ల బాధ్య‌త కేంద్రంలోని బీజేపీదే అంటూ కేసీఆర్ పోరాటానికి తెర‌తీశారు. మ‌రోవైపు బీజేపీ కూడా త‌గ్గేదేలే అన్న‌ట్లు ధాన్యం కొనుగోలు చేయాల్సింది రాష్ట్ర ప్ర‌భుత్వ‌మేన‌ని దీటుగా స్పందిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే రెండు పార్టీలు రోడ్డుమీదికెక్కి ఆందోళ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేపట్టిన నల్గొండ ప‌ర్య‌ట‌న ఉద్రిక్తంగా మారింది. ప‌ర్య‌ట‌నకు వ‌స్తే అడ్డుకుంటామ‌ని టీఆర్ఎస్ శ్రేణులు ముందుగానే హెచ్చ‌రించాయి.

అనుకున్న‌ట్లుగానే ధాన్యం కొనుగోళ్ల ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన సంజ‌య్‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాయి. ఈ సంద‌ర్భంగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు కూడా ప్ర‌తిఘ‌టించ‌డం ప‌రిస్థితి చేయి దాటింది. ఇరు వ‌ర్గాల శ్రేణులు కోడిగుడ్లు, రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడులు చేసుకోవ‌డం.. మ‌ధ్య‌లో వ‌చ్చిన పోలీసుల‌ను, పాత్రికేయుల‌ను గాయాలవ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది.

చ‌లి కాచుకోవ‌డం..

ఇప్ప‌టికే ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో ఒక‌రిపై ఒక‌రు నెపం నెట్టేసుకుంటూ విమ‌ర్శ‌లు చేసుకుంటున్న రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాల వైఖ‌రితో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారు. రైతుల బ‌తుకుల‌ను ఆగం చేసి వివాదాన్ని రాజేసి ఆ మంట‌లో టీఆర్ఎస్‌, బీజేపీ చ‌లి కాచుకుంటున్నాయ‌నే ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇప్పుడు అదీ కాక ఇలా రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు దాడులు చేసుకోవ‌డం రాజ‌కీయ ర‌ణ‌రంగాన్ని వేడెక్కించింది. త‌మ శ్రేణుల‌ను ఉసిగొల్పుతున్న రెండు పార్టీలు వెన‌కాల ఉండి రాక్ష‌స ఆనందాన్ని పొందుతున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కార్య‌క‌ర్త‌ల‌ను బ‌లి పెట్టి రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. కార్య‌క‌ర్త‌ల‌కు గాయాలై ర‌క్తాలు కారుతున్న దృశ్యాలు.. వ‌రి క‌ళ్లాల్లో ర‌క్త‌పు మ‌ర‌క‌లు.. ఇలా అక్క‌డి ప‌రిస్థితి దారుణంగా మారింది. రాజ‌కీయ ఆట‌లో వీళ్లు పావులుగా మారుతున్నార‌నే అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. కార్య‌క‌ర్త‌లు కొట్టుకుంటే ఆ సానుభూతితో ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని పార్టీలు భావించ‌డం స‌రికాద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.