Begin typing your search above and press return to search.

పీఎంఓ అడ్వైజర్ అట.. అంతా రహస్యం?

By:  Tupaki Desk   |   22 Jun 2020 5:45 AM GMT
పీఎంఓ అడ్వైజర్ అట.. అంతా రహస్యం?
X
సాక్షాత్తు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) అడ్వజైర్ అంటూ కోట్ల రూపాయలు దండుకున్న ఘరానా నేరగాడిని అత్యంత రహస్యంగా అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఇతడిని మీడియాకు ముందు ప్రవేశపెట్టకపోవడం చర్చనీయాంశమైంది. అంతేకాదు.. కేసు నమోదు చేసి.. పీటీ వారెంట్ పై తీసుకొచ్చి బెయిల్ ఇచ్చి బయటకు వెళ్లిపోవడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇదంతా రహస్యంగానే జరిగిందని వార్తలు బయటకు వచ్చాయి.. ఇంత పెద్ద ఘరానా నేరగాడిని మీడియా ముందుకు ఎందుకు ప్రవేశ పెట్టలేదని ఆరాతీస్తే పోలీస్ విభాగానికి, కేంద్ర నిఘా వర్గాలకు మధ్య ఓ కోల్డ్ వార్ జరిగినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

బీహార్ కు చెందిన అతుల్ శర్మ ఇంగ్లీష్ పై బాగా పట్టున్న వ్యక్తి. సోషల్ మీడియాలో బ్లాగులు సృష్టించి ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి అని, నాసా సైంటిస్టునని బ్లాగుల్లో రాసుకున్నారు.ఈ క్రమంలో దేశ ప్రధానికి సాంకేతిక సలహాదారులుగా తన పేరు జైవర్ధన్ గా చెప్పుకున్న అతుల్ శర్మ 1998లో ఐక్యరాజ్యసమితి కాంట్రాక్టులు ఇప్పిస్తానని గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారిని మోసం చేశాడు. సీబీఐ అతడిని ఈ కేసులు అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి 2012 వరకు జైలుకు వెళ్లి వస్తున్నాడు. నాసా సైంటిస్టును అంటూ ఓ మహిళకు 20 లక్షలు కుచ్చుటోపీ పెట్టాడు. ఓ మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే జైలుకు వెళ్లి వస్తూ ఉన్నాడు. అనంతరం అతుల్ శర్మ ఢిల్లీ స్థాయిలో కొందరు పెద్దలు, పోలీసులు, ఐఏఎస్ లు, రాజకీయ నాయకులతో స్నేహం ఏర్పరుచుకున్నాడు. పీఎంఓ అడ్వైజర్ అంటూ పైరవీలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు. వివిధ రాష్ట్రాల సీనియర్ అధికారులు, రక్షణ రంగానికి చెందిన వారీకీ ఎరవేశాడు. కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టి లక్నోలో కేసు నమోదు చేసి ఇతగాడిని అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే విచారించగా హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఓ వ్యాపారిని రూ.కోట్లలో మోసం చేసినట్టు తెలిపాడు. అబిడ్స్ లోనూ అతుల్ పై వ్యాపారి పెట్టిన కేసు ఉంది. లక్నో జైల్లో ఉన్న అతుల్ ను అబిడ్స్ పోలీసులు పీటీ వారెంట్ పై తీసుకు వచ్చి అరెస్ట్ చేశారు. 24 గంటల్లోగానే అతడికి బెయిల్ వచ్చింది. ఇవన్నీ అత్యంత రహస్యంగా జరిగిపోయాయి. ఈ విషయాన్ని పోలీసులు బయటకు పొక్కనీయలేదు. అయితే ఈ వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు తప్పుపట్టాయి. కేంద్రంలోని పెద్దలతో సంబంధాలే అతుల్ శర్మ బెయిల్ కు కారణమని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.