Begin typing your search above and press return to search.

మిర్యాలగూడ కాంగ్రెస్‌లో చ‌తుర్మ‌ఖం..!

By:  Tupaki Desk   |   3 Dec 2021 2:53 PM GMT
మిర్యాలగూడ కాంగ్రెస్‌లో చ‌తుర్మ‌ఖం..!
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో మిర్యాల‌గూడ కాంగ్రెస్ లో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం కొన‌సాగే అవ‌కాశ‌ముంది. ఒకరు ఇద్ద‌రు కాదు.. ఏకంగా న‌లుగురు ప్ర‌ముఖ నాయ‌కుల‌కు ఈ సీటుపై క‌న్ను ప‌డింది. కాంగ్రెస్ కురువృద్ధుడు జానారెడ్డి కుమారుడు ర‌ఘువీర్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి పోటీచేయాల‌ని భావిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లోనే పోటీకి ఆసక్తి చూపినా అనుకోని కార‌ణాల వ‌ల్ల పార్టీ టికెట్ ఇవ్వ‌లేదు. ఈసారి మాత్రం ఇక్క‌డి నుంచి క‌చ్చితంగా బ‌రిలో ఉండాల‌ని నిర్ణయించుకున్న‌ట్లు తెలిసింది. మిర్యాల‌గూడ‌లో ఇటీవ‌ల ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశార‌ట‌. పార్టీ కార్య‌క్ర‌మాలు ఇక్క‌డి నుంచే నిర్వ‌హించాల‌ని భావిస్తున్నార‌ట‌.

నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న బ‌త్తుల ల‌క్ష్మారెడ్డి ఎప్ప‌టి నుంచో ఈ స్థానంపై క‌న్నేశారు. కాంగ్రెస్‌లోనే ఉన్నా పార్టీలు, నాయ‌కుల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాల నెరుపుతున్నారు. మిర్యాల‌గూడ మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో ఎక్కువ‌మంది అభ్య‌ర్థుల‌ను గెలిపించుకున్నారు. ఆయ‌న‌కు పార్టీ త‌ర‌పున అనుచరుల మ‌ద్ద‌తు కూడా గ‌ణ‌నీయంగానే ఉంది. చివ‌ర్లో టికెట్ సంపాదించ‌డంలో ఇబ్బందులు ఉంటాయ‌ని ముందే గ్ర‌హించి ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల పేరుతో ప్ర‌జ‌ల్లో ఒక‌డిగా మెలుగుతున్నార‌ట‌. పార్టీ అసెంబ్లీ టికెట్ త‌న‌కే ఇవ్వాల‌ని.. ర‌ఘువీర్‌కు ఇవ్వాల్సి వ‌స్తే న‌ల్ల‌గొండ ఎంపీ స్థానానికి పంపాల‌ని ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం కోరుకుంటోంది.

కాంగ్రెస్ నిరాక‌రిస్తే బీజేపీ నుంచైనా టికెట్ తెచ్చుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది అనుచ‌ర వ‌ర్గం. ఇదిలా ఉంటే అలుగుబెల్లి అమ‌రేంద‌ర్‌రెడ్డి ప‌రిస్థితి మ‌రోలా ఉంది. క్రితం సారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అమ‌రేంద‌ర్‌రెడ్డి ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన భాస్క‌రావు టీఆర్ఎస్‌లోకి రావ‌డంతో అమ‌రేంద‌ర్‌రెడ్డి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ వేదిక‌గా కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. ప్ర‌స్తుతం టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్‌లో పోటీని ఊహించి మ‌రో పార్టీతో కూడా రాయ‌బారాలు నెరుపుతున్నార‌ని స‌మాచారం.

1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన రేపాల శ్రీ‌నివాస్ కూడా టికెట్ రేసులో ముందున్నారు. ఇర‌వై సంవ‌త్సరాలుగా పార్టీని అంటి పెట్టుకున్నత‌న‌కే టికెట్ వ‌స్తుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల పార్టీ చేప‌ట్టిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై ధ‌ర్నాలు, జంగ్ సైర‌న్ లాంటి కార్య‌క్ర‌మాల్లో కూడా త‌న అనుచ‌ర వ‌ర్గంతో క‌లిసి చురుకుగా పాల్గొంటున్నారు. అయినా త‌న‌కు టికెట్ వ‌స్తుందో లేదోన‌న్న అనుమానంతో ఉన్నార‌ట‌. ముందు జాగ్ర‌త్త‌గా మ‌రో పార్టీతో సంప్ర‌దింపులు కూడా జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల నాటికి అధిష్ఠానం ఎవ‌రికి టికెట్ కేటాయిస్తుందో.. ఎవ‌రిని బుజ్జ‌గించి ఇత‌ర హామీలు ఇస్తుందో.. ఈ న‌లుగురిలో ఎవ‌రు ఏ పార్టీలో ఉంటారో వేచిచూడాలి.