Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్‌లో మంట పుట్టించిన కౌన్సిల‌ర్‌..!

By:  Tupaki Desk   |   5 Jan 2022 3:30 PM GMT
టీఆర్ఎస్‌లో మంట పుట్టించిన కౌన్సిల‌ర్‌..!
X
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ టీఆర్ఎస్ లో ఒక కౌన్సిల‌ర్ మంట పుట్టించారు. మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ పై ఆరోప‌ణ‌లు చేశారు. మంత్రి నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని.. ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఏకంగా మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్లో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఈ విష‌యం ఎటుతిరిగి ఎక్క‌డికి దారి తీస్తోంద‌నే అనుమానాల‌ను కార్య‌క‌ర్త‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన 43వ వార్డు కౌన్సిల‌ర్ బురుజు సుధాక‌ర్‌రెడ్డి త‌న వార్డు ప‌రిధిలో.. ప‌ట్ట‌ణంలో అక్ర‌మ క‌ట్ట‌డాలు, క‌బ్జాలు జ‌రుగుతున్నాయ‌ని ఇటీవ‌ల త‌ర‌చూ ఫిర్యాదులు చేస్తున్నార‌ట‌. ఈ విష‌యంలో కొంద‌రు అక్ర‌మార్కుల‌కు మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని ఆయ‌న అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా మంత్రికే స‌పోర్టు చేస్తున్నార‌ని ఆయ‌న భావిస్తున్నారు. వ‌న్‌టౌన్ సీఐతో క‌లిసి త‌న‌ను హ‌త్య చేసేందుకు మంత్రి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు.

ఈ విష‌యం జిల్లాలో దావానంలా వ్యాపించ‌డంతో పార్టీ శ్రేణులు అల‌ర్ట్ అయ్యాయి. గొడ‌వ పెద్ద‌ది కాకుండా.. పార్టీలో అస‌మ్మ‌తి స్వ‌రాలు వినిపించ‌కుండా.. కౌన్సిల‌ర్ సుధాక‌ర్‌రెడ్డి పైనే ఎదురుదాడి ప్రారంభించాయి. ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు శివ‌కుమార్ వెల్ల‌డించారు. కౌన్సిల‌రే ఒక క‌బ్జా కోర‌ని.. ఆయ‌న ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని విమ‌ర్శించారు.

ఈ వ్య‌వ‌హారం ఇలా కొన‌సాగుతుండ‌గానే.. కౌన్సిల‌ర్ సుధాక‌ర్‌రెడ్డి మ‌రో ముగ్గురు క‌లిసి భూ క‌బ్జాల‌కు పాల్ప‌డ్డార‌ని రెవెన్యూ అధికారులు తేల్చేశారు. సుధాక‌ర్‌రెడ్డి తన వార్డు ప‌రిధిలోని రాంన‌గర్ పాఠ‌శాల‌కు చెందిన గ్రామ కంఠం భూమిని న‌కిలీ ప‌త్రాలు సృష్టించి క‌బ్జా చేశార‌ని త‌హ‌సీల్దార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మాజీ కౌన్సిల‌ర్ మ‌నోహ‌ర్ లోకాయుక్త‌లో ఫిర్యాదు చేసిన కాపీ ఆధారంగా రెవెన్యూ యంత్రాంగం ఒక్క రోజులోనే విచార‌ణ జ‌రిపింది. పాఠ‌శాల స్థ‌లాన్ని స‌ర్వే చేసి కౌన్సిల‌ర్ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై కౌన్సిల‌ర్ సుధాక‌ర్‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప‌ట్ట‌ణంలో భూముల క‌బ్జాలు పాల్ప‌డుతున్న మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్.. అత‌ని అనుచ‌రులు త‌న‌ని విమర్శించ‌డం విడ్డూరంగా ఉంద‌ని అంటున్నారు. త‌న‌కు మంత్రి నుంచి.. ఆయ‌న అనుచ‌రుల నుంచి ప్రాణ హాని ఉంద‌ని.. త‌న‌కు ఏదైనా జ‌రిగితే శ్రీ‌నివాస్‌గౌడే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ విష‌యం జిల్లా టీఆర్ఎస్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఈ వ్య‌వ‌హారం ఏ మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాలి.