Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీ కాషాయంతో చట్టాపట్టాల్?

By:  Tupaki Desk   |   10 Nov 2019 7:32 AM GMT
కాంగ్రెస్ పార్టీ కాషాయంతో చట్టాపట్టాల్?
X
శివసేన.. భారతీయ జనతా పార్టీకి అత్యంత మిత్రపక్షం. ఇప్పుడు కాదు దశాబ్దాల నుంచి సేన-బీజేపీలు సన్నిహిత పార్టీలుగానే సాగుతూ ఉన్నాయి. దానికి అనేక కారణాలున్నాయి. మరాఠా వాదంతో ఆవిర్భవించిన పార్టీనే అయినప్పటికీ శివసేనకు కూడా హిందుత్వవాదం ఉంది. ఆ పార్టీ పేరునే శివుడి పేరు మీదుగా పెట్టుకున్నారు. తమది శివసేన అని చెప్పుకుంటారు.

శివుడి త్రిశూలాన్ని కూడా శివసైనికులు చేతబట్టే టైపు. అలాగే రామమందిరం తదితరాల్లో కూడా శివసేనది బీజేపీ వాదమే. అన్నింటికీ మించి శివసేన అధికారిక రంగు కాషాయమే. బీజేపీ కాషాయాన్నే శివసేన ధరిస్తూ వచ్చింది. ఆ పార్టీ అధికారిక జెండా కూడా అదే రంగులో ఉంటుంది.

ఇలా కాషాయ పార్టీగా నిలుస్తుంది సేన. అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం శివసేన బీజేపీతో విబేధిస్తూ వచ్చింది. పాక్ పై కొన్ని సార్లు బీజేపీ కన్నా తీవ్రమైన అక్కసు వెల్లగక్కడం, కొన్ని సార్లు స్నేహపూర్వకంగా మాట్లాడటం సేనకు అలవాటే.

ఎన్ని చేసినా, ఏం చెప్పినా శివసేన మాత్రం కాషాయ పార్టీనే. ఇప్పుడు మహారాష్ట్రలో కొత్త గేమ్ మొదలైంది, బీజేపీ-శివసేనలు తీవ్రంగా విమర్శించుకుంటూ ఉన్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆ పార్టీలు ముఖ్యమంత్రి పీఠం పై మమకారంతో దూషించుకుంటూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సై అని సేన నేతలు ప్రకటించారు.

అయితే సేన-ఎన్సీపీ కలిసినా ప్రభుత్వ ఏర్పాటు కుదరదు. దానికి కాంగ్రెస్ మద్దతు అవసరం! మరి ప్రభుత్వం ఏర్పడితే తమదే సీఎం పీఠం అని సేన అంటోంది. అలాంటప్పుడు ఈ కాషాయ పార్టీ పీఠంపై కూర్చోవడానికి కాషాయ అజెండా వ్యతిరేకి అయిన కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా? అనేది ఆసక్తిదాయకమైన విషయం.