Begin typing your search above and press return to search.

బాబు ఆప‌రేష‌న్‌ కు భాజ‌పా ఆయింట్మెంట్‌!

By:  Tupaki Desk   |   17 Sep 2016 10:35 AM GMT
బాబు ఆప‌రేష‌న్‌ కు భాజ‌పా ఆయింట్మెంట్‌!
X
ఆంధ్రాలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పార్ట్‌-2 త్వ‌ర‌లో రాబోతోందా అంటే - అవున‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి! మ‌రింతమంది వైకాపా ఎమ్మెల్యేల‌ను ఆక‌ర్షించేందుకు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను వాడుకునే వ్యూహంలో తెలుగుదేశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. క్యాబినెట్ లోకి 11 మంది కొత్త మంత్రులను తీసుకునే అవ‌కాశం ఉన్నా కూడా... అన్ని ఖాళీలూ భ‌ర్తీ చేసే మూడ్ లో చంద్ర‌బాబు లేర‌ని తెలుస్తోంది! కొన్ని ఖాళీలు ఉంచి - వాటిని ఎర‌గా చూసి మ‌రోసారి ఆక‌ర్ష్ కు దిగే అవ‌కాశాలున్న‌యని అనుకుంటున్నారు. అయితే, చంద్ర‌బాబు చేప‌ట్ట‌బోతున్న... గ‌తంలో చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ విష‌యంలో కేంద్రంలోని అధికార పార్టీ భాజ‌పా స్పంద‌న ఏంట‌నేది ఇప్పుడు తేట‌తెల్లం అయింద‌నే చెప్పాలి. అడ్డ‌గోలుగా వైకాపా ఎమ్మెల్యేల‌కు ఎర‌వేసి గుంజుకుంటున్న తెలుగుదేశం తీరుపై భాజ‌పా పెద్ద‌గా ప్ర‌శ్నించిందీ లేదూ నిల‌దీసిందీ లేదు! అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై భాజ‌పా స్పందిస్తున్న తీరు చూస్తుంటే... ఆంధ్రాలోని ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు మ‌ద్ద‌తు ఇచ్చేలానే అనిపిస్తోంది!

అరుణాచ‌ల్ లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు స్పందించారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పూర్తిగా పోయింద‌నీ - అందుకే ముఖ్య‌మంత్రితో స‌హా నాయ‌కులంద‌రూ పార్టీని వీడిపోయార‌న్నారు. నాయ‌క‌త్వంపై విశ్వాసం పోవ‌డం వ‌ల్ల‌నే ప్రాంతీయ పార్టీలోకి కాంగ్రెస్ నేత‌లు వ‌చ్చి చేరుతున్నార‌న్నారు. కాంగ్రెస్ కి క‌ష్టకాలం వ‌చ్చింద‌నీ, అరుణాచ‌ల్ కి మంచి రోజులు వ‌స్తున్నాయ‌ని అన్నారు. నిజానికి - అరుణాచ‌ల్ లో సాగుతున్న పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్ కి తెర వెనక ఉండి న‌డిపిస్తున్న‌ది భాజ‌పా అనేది ఓపెన్ సీక్రెట్‌! అంటే - ఫిరాయింపుల్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్టుగానే అర్థం చేసుకోవాలి. ఫిరాయింపు విష‌యంలో గ‌తంలో కొన్ని నీతి వ్యాక్యాలు ప‌లిక వెంక‌య్య నాయుడే, ఇవాళ్ల ఈ విధంగా స‌మ‌ర్థించుకుంటున్నారు.

రేప్పొద్దున్న ఆంధ్రాలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మ‌రోసారి మొదలైనా కూడా ఇదే విశ్లేష‌ణ ఇస్తారేమో! ఆంధ్రాలో ప్ర‌తిప‌క్ష నేత‌పై నాయ‌కుల‌కు న‌మ్మ‌కం పోయిందీ... అందుకే తెలుగుదేశంలోకి చేరుతున్నార‌ని అభివ‌ర్ణిస్తారేమో.! ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఇచ్చినమాట‌ గ‌ట్టున పెట్టి, వ‌ద్ద‌న్న ప్యాకేజీని ప్ర‌జ‌ల‌పై రుద్దినా కూడా... చిరున‌వ్వుతో స్వాగ‌తించారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌నోభావాలూ ప్ర‌యోజ‌నాలూ వగైరాల‌ను ప‌క్క‌నపెట్టి... ప్యాకేజీపై ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తున్నా దాన్ని తుడిచేసుకుని మ‌రీ భాజ‌పాకి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. చంద్ర‌బాబు చేస్తున్న ఈ త్యాగాన్ని వారూ గుర్తిస్తారు క‌దా! ‘ప్యాకేజీ ఎంత గొప్ప‌దో’ అని ప్ర‌జ‌ల చెవుల్లో బాకాలు ఊదుతున్న భాజ‌పా నేతలు.. రేప్పొద్దున్న తెలుగుదేశం చేప‌ట్ట‌బోయే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను ఒక చారిత్ర‌క అవ‌స‌రంగా ప్ర‌తిపక్షేపించి ప్ర‌జ‌ల‌కు చూపించినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏమీ లేద‌న్న‌ది ప‌లువురి అభిప్రాయం!