Begin typing your search above and press return to search.

మధ్యప్రదేశ్ లో సంచలనం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎర

By:  Tupaki Desk   |   4 March 2020 5:20 AM GMT
మధ్యప్రదేశ్ లో సంచలనం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎర
X
ఇన్నాళ్లు పలు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి దేశమంతా పార్టీనే ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ కుట్రలు పన్ని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి చర్య కొన్నిసార్లు విజయవంతం కాగా మరికొన్ని సార్లు తీవ్ర అభాసుపాలైంది. తాజాగా దేశానికి మధ్యలో ఉన్న కీలక రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కూల్చివేసే కుట్ర జరుగుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యేలను బీజేపీ గాలం వేస్తోందని కాంగ్రెస్ పార్టీ మంగళవారం సంచలన ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడానికి అడ్డదారులు బీజేపీ తొక్కుతోందని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా మధ్యప్రదేశ్ లో పరిణామాలు వేడెక్కాయి. అధికారానికి కొన్ని సీట్లు తక్కువగా ఉండడంతో గతంలో ఇతర రాష్ట్రాల్లో వ్యవహరించిన మాదిరి ఇక్కడ పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని బీజేపీ నాయకులు తమ కూటమికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను హర్యానాలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లారని మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి జితు పట్వారీ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఎమ్మెల్యేలను బీజేపీ బలవంతంగా నిర్బంధించిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీమంత్రులు నరోత్తమ్ మిశ్రా, భూపేంద్ర సింగ్, రాంపాల్ సింగ్ వంటి బీజేపీ ఆ ఎమ్మెల్యేలను హర్యానాలోని ఒక హోటల్‌కు బలవంతంగా తీసుకెళ్లారని వెల్లడించారు.

ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి కాంగ్రెస్ సహా ఇతర ఎమ్మెల్యేలకు రూ .25 కోట్లు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ ఆరోపించారు. ఆయన ఈ ఆరోపణలు చేసిన వెంటనే మధ్యప్రదేశ్ మంత్రిగా జితు పట్వారీ కూడా ఆ ఆరోపణలు చేయడంతో బీజేపీ కుట్రలకు తెరలేపిందని, అధికారంలోకి రావడానికి ఈ విధంగా చేస్తోందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ విషయమై దిగ్విజయ్ సింగ్ ట్విటర్ లో స్పందించారు.

''కాంగ్రెస్, బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి భూపేంద్ర సింగ్ చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయిని ఢిల్లీకి తీసుకెళ్ల లేదా? శివరాజ్ సింగ్ చౌహాన్ ఏదో చెప్పాలనుకుంటున్నారా? ''
''అయితే, తాము రామ్ బాయిని పూర్తిగా నమ్ముతున్నామని ఆమె (ముఖ్యమంత్రి) కమల్ నాథ్ అభిమానురాలు ఆమె కమల్ నాథ్ కు మద్దతునిస్తూనే ఉంటుంది.'' అని దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ లో తెలిపారు.

కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను బీజేపీ తిప్పి కొట్టింది. సంచలనాల కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దిగ్విజయ్ సింగ్ ఆరోపణలపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ దిగ్విజయ సింగ్ ఆరోపణలు ముఖ్యమంత్రి కమల్ నాథ్ పై ఒత్తిడి తెచ్చే వ్యూహమని తెలిపారు.

ఈ ఆరోపణల నేపథ్యం లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించి మీడియాతో మాట్లాడారు. 'దిగ్విజయ సింగ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ 15 ఏళ్ల పాటు పాలించడంతో తమ పాలనలో జరిగిన మోసాలు త్వరలో బహిర్గతమవుతాయని బీజేపీ భయపడుతోందని తెలిపారు. అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుస్తున్నారనే పుకార్ల తో ప్రభుత్వ స్థిరత్వానికి ఎటువంటి ముప్పు లేదని ధీమా వ్యక్తం చేశారు.

అయితే మధ్యప్రదేశ్ లో బలాబలాలు ఇలా ఉన్నాయి.
మొత్తం స్థానాలు 230
కాంగ్రెస్ 114
బీజేపీ 107
స్వతంత్రులు 4
ఎస్పీ 1, బీఎస్పీ 2
రెండు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ ఏర్పాటు కు 116 స్థానాలు కావాల్సి ఉండగా ఎస్పీ, బీఎస్పీ, స్వతంత్రులతో కలిపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం బలం 121