Begin typing your search above and press return to search.

హత్రాస్ ఎఫెక్ట్ ..స్మృతీ ఇరానీకి వారణాసిలో చేదు అనుభవం!

By:  Tupaki Desk   |   3 Oct 2020 5:30 PM GMT
హత్రాస్ ఎఫెక్ట్ ..స్మృతీ ఇరానీకి వారణాసిలో చేదు అనుభవం!
X
హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దళిత యువతిని నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై విపక్షాలు, ప్రజా సంఘాలు భగ్గమంటున్నాయి. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐతే ఈ కేసులో అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా.. రాత్రివేళ రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసిలో చేదు అనుభవం ఎదురైంది. స్థానిక కమిషన్ ఆఫీస్ అడిటోరియంలో ప్రసంగించేందుకు వెళ్తున్న సమయంలో స్మృతీ ఇరానీని నిరసనకారులు అడ్డుకున్నారు.

హత్రాస్ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రాహుల్ , ప్రియాంక ను హత్రాస్ భాదిత కుటుంబ సబ్యులని పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం పై నిరసన వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్మృతీ ఇరానీని అడ్డుకుని 'గో బ్యాక్' నినాదాలు చేశారు.ఈ క్రమంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలకు,వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు నిరసనకారులను అదుపుచేసి స్మృతీ ఇరానీని అక్కడికి నుంచి పంపించేశారు. ఆ తరువాత ఈ ఘటన పై ఆమె మాట్లాడారు.

ఒక ప్రజాస్వామ్య దేశంలో ఓ నాయకుడిని నేను ఆపలేను. అదీ ఓ అత్యాచార ఘటనపై రాజకీయం చేయాలనుకునేవారిని అసలు ఆపలేను. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్తామని పట్టుబడుతున్నది బాధితురాలికి న్యాయం జరగాలని కాదు. వాళ్ల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అని విమర్శించారు. హత్రాస్ లాంటి ఘటనలను ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు.ఆ బాధితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ను కోరినట్లు తెలిపారు. సిట్ విచారణ బృందం తమ నివేదికను సమర్పించిన తర్వాత కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని స్మృతీ ఇరానీ అన్నారు. మహిళా హక్కులకు,వారి భవిష్యత్తుకు మోదీ సర్కార్ ఎప్పుడూ రక్షణగా ఉంటుంది అని తెలిపారు.