Begin typing your search above and press return to search.

మోదీ 2011లో అలా.. 2018లో ఇలా..

By:  Tupaki Desk   |   17 May 2018 2:05 PM GMT
మోదీ 2011లో అలా.. 2018లో ఇలా..
X
కర్ణాటకలో బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడతో ఏమీ చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ, మోదీలకు ఎదురు నిలవలేకపోయినా వీలైనంతగా వారి కుటిల రాజకీయాలను ఏకిపడేసే ప్రయత్నం మాత్రం చేస్తోంది. రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగే రాజకీయం చేయలేక.. గత్యంతరం లేక, ఎదురెళ్లి మరీ జేడీఎస్‌కు మద్దతు పలికినా ముఖ్యమంత్రి పీఠాన్ని మాత్రం బీజేపీకి కాకుండా చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఇప్పుడు మోదీ - బీజేపీలను ఎండగట్టేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తూ పాత చరిత్రనంతా తవ్వి తీస్తోంది. అందులో భాగంగానే 2011లో కర్ణాటకలోని రాజకీయ పరిణామాలు.. అప్పుడు మోదీ చేసిన ట్వీట్‌ను మరోసారి ప్రజలకు గుర్తు చేసేందుకు దాన్నిరీ ట్వీట్ చేసింది.

తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలమని.. తగినంతమంది మంది ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని కాంగ్రెస్, జేడీఎస్ లు చెప్పినా గవర్నరు మాత్రం యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. గవర్నరును వాడుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని తూర్పారపడుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో మరోసారి బీజేపీని టార్గెట్ చేసింది. ఇదే కర్ణాటకపై ఇంతకు ముందు మోదీ స్టాండేమిటో బయటపెట్టింది.

2011లో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ అస్థిరత ఏర్పడింది. అవినీతి ఆరోపణలతో యడ్యూరప్ప పదవి నుంచి దిగిపోయారు. ఆ సమయంలో అప్పటి గవర్నర్ భరద్వాజ్ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలనకు సిఫారసు చేశారు. కానీ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడి బలాన్ని నిరూపించుకుంది. దీంతో అప్పట్లో నాలుగు రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు - నరేంద్రమోదీ - శివరాజ్ సింగ్ చౌహన్ తదితరులు రాష్ట్రపతికి లేఖలు సంధించారు. గవర్నర్‌ను రీకాల్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకువచ్చింది. అప్పటి మోదీ ట్వీట్‌ను మరోసారి రీ ట్వీట్ చేసింది. దీనికి కమలనాథులేం సమాధానం చెప్తారో చూడాలి.