Begin typing your search above and press return to search.

మిషన్ శక్తి.. కాంగ్రెస్ vs బీజేపీ

By:  Tupaki Desk   |   28 March 2019 11:38 AM GMT
మిషన్ శక్తి.. కాంగ్రెస్ vs బీజేపీ
X
విను వీధులో భారత శాస్త్రవేత్తలు ఘనత సాధించారు. మిషన్ ‘శక్తి’ని చాటారు.కానీ ఈ క్రెడిట్ ఎవరిది.? దీన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు ఎందుకు పోటీపడుతున్నాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేంతగా ‘మిషన్ శక్తి’ మాటల యుద్ధం తయారైంది.

భూమి చుట్టు తిరుగుతున్న ఉపగ్రహాలను పేల్చేసే సత్తా గల దేశాల జాబితాలోకి తాజాగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేరింది. ఇది బీజేపీ హయాంలో సాధించిన విజయంగా మోడీ చెప్పకపోయినా.. ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించగానే రాజకీయ దుమారం రేగింది. మిషన్ శక్తి ఘనతను తన ఖాతాలో వేసుకునేలా మోడీ మాట్లాడడంతో వివాదాస్పదమైంది.

దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా సెటైర్ వేశారు. అంతరిక్ష పరిశోధన సంస్థ 1962లోనే నెహ్రూ హయాంలో నెలకొల్పబడిందని.. శాటిలైట్ల తయారీలో బీజేపీ క్రెడిట్ ఏమీలేదని కుండబద్దలు కొట్టారు.ఈ సందర్భంగా డీఆర్డీఏ శాస్త్రవేత్తలను అభినందించిన రాహుల్.. మోడీపై సెటైర్లు వేశారు.. మోడీకి ప్రపంచ నాటక రంగ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోడీ మిషన్ శక్తి ప్రకటనపై రాజకీయాలు మానండని బీజేపీకి హితవు పలికారు.

ప్రతిపక్షాల మెరుపుదాడితో అలెర్ట్ అయిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మొన్న సైనికులను.. నేడు శాస్త్రవేత్తలను అవమానించాడని మండిపడ్డారు. రాహుల్ లో రాజరిక పోకడలు పెరిగాయని.. దేశం కోసం పనిచేస్తున్న వారిని అవమానిస్తున్నాడని దుయ్యబట్టారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం కాంగ్రెస్ విమర్శలపై మండిపడ్డారు. సైంటిస్టులను అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రెండు పార్టీలు ఎన్నికల సమయంలో ‘మిషన్ శక్తి’ ప్రాజెక్ట్ విజయంపై క్రెడిట్ కోసం కొట్లాడుకుంటున్నాయి. మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.