Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ - బీజేపీలు.. నోటా కంటే తక్కువగా..

By:  Tupaki Desk   |   26 May 2019 4:20 AM GMT
కాంగ్రెస్ - బీజేపీలు.. నోటా కంటే తక్కువగా..
X
ఆశ్చర్యం.. అనూహ్యం.. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతాలు చోటుచేసుకున్నాయి. ప్రాంతీయ పార్టీ వైఎస్సార్ సీపీ ఏపీలో సీట్లన్నింటిని ఊడ్చేసింది. టీడీపీకి చుక్కలు చూపింది. అంతే కాదు.. ఫ్యాన్ గాలిలో దేశాన్ని ఏలుతున్న బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా కుదేలయ్యింది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ ధాటికి జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కకావికలమయ్యాయి. ఈ రెండు పార్టీలకంటే నోటాకు ఎక్కువ పడడం సంచలనంగా మారింది.

ఎన్నికల కమిషన్ తాజా లెక్కల ప్రకారం.. నోటాకు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 1.2 ఓట్ల శాతం పడ్డాయి. ఈ లెక్కన 3.98 లక్షల ఓట్లు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు పడినట్లు తెలిపింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో నోటాకు 1.5శాతం ఓట్లతో 4.65లక్షల ఓట్లు ఏపీ వ్యాప్తంగా పడ్డాయి.

ఇక నోటాకంటే చాలా తక్కువగా.. తీసికట్టుగా బీజేపీకి కాంగ్రెస్ లకు ఓట్లు పడడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి కేవలం 0.96శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. ఇక కాంగ్రెస్ కు 1.2శాతం పడ్డాయి. ఈ లెక్కలు చూస్తే అసలు ఏపీలో కాంగ్రెస్, బీజేపీలు ఏమాత్రం ప్రభావం చూపలేదని అర్థమవుతోంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్, హోదా ఇవ్వకపోవడంతో బీజేపీకి ఏపీలో నూకలు చెల్లినట్టేనని ఈ ఎన్నికలతో అర్థమైంది.

ముఖ్యంగా నోటాకు అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా ఓట్లు పడడం విశేషం. ఇక్కడ 8000 ఓట్లు నోటాకు వేశారు. అరకు పార్లమెంట్ లో మొత్తం 47000 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇక్కడ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ టీడీపీ తరుఫున నిలబడ్డారు.

ఇలా నోటా కంటే తీసికట్టుగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఏపీలో తయారైందనడంలో ఎలాంటి సందేహం లేదు.