Begin typing your search above and press return to search.

అక్కడ అసెంబ్లీ - లోక్ సభ పోల్స్ కు తేడా ఉంటుందా?

By:  Tupaki Desk   |   6 May 2019 2:30 PM GMT
అక్కడ అసెంబ్లీ - లోక్ సభ పోల్స్ కు తేడా ఉంటుందా?
X
రాజస్తాన్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఐదేళ్లకూ ఒక పార్టీ ప్రభుత్వాన్ని మార్చేయడమే అక్కడి ప్రజల ప్రత్యేకత. సాధారణంగా ఉత్తరాదిన అలాంటి పరిస్థితి కనిపించదు. ఒకరిని చిత్తు చేయడం - మరొకరిని నెత్తికి ఎత్తుకోవడం చేసే విభిన్నమైన రాష్ట్రం రాజస్తాన్. గత కొన్ని పర్యాయాలుగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక పార్టీని ఓడిస్తూ మరో పార్టీని గెలిపిస్తూ ఉంటారు. అక్కడ ప్రధాన పోటీదారులు కాంగ్రెస్ - బీజేపీ. ఇటీవలే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండు వందల అసెంబ్లీ స్థానాలున్న అక్కడ కచ్చితంగా వంద సీట్లలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. భారతీయ జనతా పార్టీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఓడినా బీజేపీ మరీ చిత్తు అయిపోలేదు. బీజేపీ డెబ్బై మూడు అసెంబ్లీ స్థానాలను గెలిచి బలమైన ప్రతిపక్షంగా నిలిచింది.

ఇక బీఎస్పీ ఆరు సీట్లలో - ఆర్ ఎల్డీ ఒక సీట్లో - ఇండిపెండెంట్లు పదమూడు సీట్లలో… ఇతరులు మిగిలిన సీట్లలో నెగ్గారు. ఇదంతా జరిగి కొన్ని నెలలు అవుతున్నాయి. ఇంతలోనే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి.

రాజస్తాన్ లో పాతిక ఎంపీ సీట్లున్నాయి. గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికలప్పుడు అక్కడ బీజేపీ గాలి బలంగా వీచింది. అప్పటికే వసుంధర రాజే ప్రభుత్వం కొలువుదీరింది. దానికి మోడీ గాలి తోడు కావడంతో పాతిక ఎంపీ సీట్లకు గానూ అన్ని సీట్లనూ బీజేపీ నెగ్గింది. క్లీన్ స్వీప్ చేసింది.

ఇక ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయనేదే అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండాలి. సరిగ్గా వంద ఎమ్మెల్యే సీట్లను నెగ్గింది. కాబట్టి.. కనీసం పదమూడు ఎంపీ సీట్లను అయినా కాంగ్రెస్ నెగ్గాలి. మిగతావి బీజేపీ ఖాతాలోకి పడాలి.

అయితే అలా ఏం కాదని.. తమదే పై చేయి అవుతుందని ఈ ఇరు పార్టీలూ ఇప్పుడు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాజస్తాన్ లో తాము స్వీప్ చేస్తామంటూ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ప్రకటించుకున్నారు. అన్ని ఎంపీ సీట్లనూ తమ పార్టీనే నెగ్గుతుందని ఆయన ప్రకటించుకున్నారు.

అయితే బీజేపీ నేతలు మాత్రం అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్ సభ ఎన్నికలు వేరని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు వసుంధర రాజేకు వ్యతిరేకత ఉండేదని.. దీంతో అప్పుడు రాజస్తాన్ లో తమ పార్టీ ఓడిందని, మోడీ మీద తమ రాష్ట్రంలో ఎలాంటి వ్యతిరేకత లేదని.. అందుకే ఈ సారి కూడా బీజేపీ అక్కడ పై చేయి సాధిస్తుందని కమలనాథులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

సంప్రదాయం ప్రకారం చూస్తే లోక్ సభ ఎన్నికల్లో రాజస్తాన్ లో కాంగ్రెస్ పై చేయి సాధించాలి. బీజేపీ మాత్రం అలా ఏం కాదని అంటోంది! ఇక ఏం జరగబోతోందో మే ఇరవై మూడున తేలాల్సిందే!