Begin typing your search above and press return to search.

రిట‌ర్న్ జ‌ర్నీ కూడా బ‌స్సులోనే ఎందుకు?

By:  Tupaki Desk   |   19 May 2018 4:25 AM GMT
రిట‌ర్న్ జ‌ర్నీ కూడా బ‌స్సులోనే ఎందుకు?
X
క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో త‌మ ఎమ్మెల్యేల్ని హైద‌రాబాద్‌కు త‌ర‌లించే విష‌యంలో కాంగ్రెస్‌.. జేడీఎస్ లు భారీ ప్లానే ను వేశాయి. కేర‌ళలోని కొచ్చికి వెళుతున్న‌ట్లుగా శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కూ హ‌డావుడి చేసిన వారు.. అనూహ్యంగా.. గుట్టుచ‌ప్పుడు కాకుండా మూడు బ‌స్సులు.. యాభైకి పైగా వాహ‌నాల్లో ఎమ్మెల్యేల్ని తీసుకురావ‌టం తెలిసిందే.

శుక్ర‌వారం ఉద‌యానికి హైద‌రాబాద్‌కు చేరుకున్న క‌ర్ణాట‌క పొలిటిక‌ల్ బ‌స్సులు ఆస‌క్తిక‌రంగా మారాయి. సుప‌రీం తీర్పు నేప‌థ్యంలో శ‌నివారం ఉద‌యానికి బెంగ‌ళూరుకు చేరుకోవాల్సి ఉంది. ఎవ‌రికి తెలీకుండా సీక్రెట్ గా హైద‌రాబాద్‌కు తీసుకొచ్చిన ఎమ్మెల్యేల్ని.. తిరిగి బెంగ‌ళూరుకు బ‌స్సులో తీసుకెళ్ల‌టం రిస్క్ అన్న వాద‌న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో బ‌లంగా వినిపించింది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బ‌స్సులో తీసుకెళ్ల‌టం క్షేమ‌క‌రం కాద‌న్న వాద‌న వినిపించింది. దీంతో ప్ర‌త్యామ్నాయంగా ఫ్లైట్ జ‌ర్నీ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. ఫ్లైట్ జ‌ర్నీ పెట్టుకున్న త‌ర్వాత‌.. బెంగ‌ళూరులో దిగేందుకు విమానానికి అనుమ‌తి ఇవ్వ‌ని ప‌క్షంలో.. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు చేరుకోలేర‌ని.. ఫ్లైట్ రిస్క్ తీసుకునే క‌న్నా.. బ‌స్సులో భ‌ద్రంగా తీసుకెళ్ల‌టం ఉత్త‌మ‌మ‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

దీంతో.. దాదాపు ప‌ది గంట‌ల‌కు పైనే ప్ర‌యాణం చేసి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన కాంగ్రెస్‌.. జేడీఎఎస్ నేత‌లు కేవ‌లం 14-15 గంట‌ల వ్య‌వ‌ధిలోనే బెంగ‌ళూరుకు రిట‌ర్న్ జ‌ర్నీ చేయాల్సి వ‌చ్చింది. బెంగ‌ళూరు నుంచి వ‌చ్చిన బ‌స్సుల్లోనే రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బ‌య‌లుదేరాయి. ఎమ్మెల్యేలు ఉన్న బ‌స్సుల‌కు భారీ భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తూ చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఒక్కో బ‌స్సుకు ముందు 20 వాహ‌నాలు.. వెనుక మ‌రో 20 వాహ‌నాలు ర‌క్ష‌ణ‌గా బ‌య‌లుదేరాయి. భారీ కాన్వాయ్ తో ఎమ్మెల్యేలు ఉన్న బ‌స్సులు వెళ్ల‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అదే స‌మ‌యంలో.. బ‌స్సులు ప్ర‌యాణించే రూట్ల‌లో కాంగ్రెస్ త‌న పార్టీకి చెందిన నేత‌ల్ని అలెర్ట్ చేసి ఉంచిన‌ట్లుగా తెలుస్తోంది.

హైద‌రాబాద్ కు వ‌చ్చిన‌ప్పుడు శ‌ర్మ ట్రావెల్ బ‌స్సుల్ని వినియోగించ‌గా.. రిట‌ర్న్ వెళ్లే వేళ‌లో శ‌ర్మ ట్రావెల్ బ‌స్సుల‌కు.. ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బ‌స్సులు తోడు కావ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా.. తాజ్ కృష్ణ‌లో రాత్రివేళ ఇద్ద‌రు అప‌రిచితుల్ని కాంగ్రెస్ నేత‌లు గుర్తించిన‌ట్లు చెబుతున్నారు. ఇందులో ఒక‌రిని ప‌ట్టుకొని అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. హోట‌ల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని ప్ర‌లోభ పెట్టేందుకు.. ప‌క్క‌దారి పెట్టేలా చేసేందుకు బీజేపీకి చెందిన కొంద‌రు ప్లాన్ చేసిన‌ట్లుగా వ‌దంతులు వ్యాపించాయి. ఇదే స‌మ‌యంలో తాజ్ కృష్ణ లో ఇద్ద‌రు అప‌రిచితుల్ని గుర్తించ‌టం క‌ల‌క‌లం రేపింది.