Begin typing your search above and press return to search.

అరుణాచల్ ప్రదేశ్ లో ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   17 Dec 2015 5:36 AM GMT
అరుణాచల్ ప్రదేశ్ లో ఏం జరుగుతోంది?
X
ఈశాన్యరాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ వార్తల్లోకి వచ్చేసింది. ఇప్పటికే పలు తలనొప్పులతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ కు తాజా పరిణామం ఇబ్బందికరంగా మారింది. కేంద్రంలోని మోడీ సర్కారు అండదండలతో వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు చెలరేగిపోవటం.. అంతిమంగా ఆ ప్రభావం కాంగ్రెస్ మీద పడుతోంది. తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూలో అక్కడి కాంగ్రెస్ సర్కారు పుట్టి మునిగిపోయే పరిస్థితి. అసలింతకూ అరుణాచల్ ప్రదేశ్ లో ఏం జరుగుతుంది? ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

అరుణాచల్ ప్రదేశ్ లోఅధికార మార్పిడికి సంబంధించిన రాజకీయ ఎత్తుగడలు మొదలయ్యాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే.. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పటంతో పాటు.. విపక్ష బీజేపీ నేతలతో చేతులు కలపటంతో.. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సర్కారు భవితవ్యం ఇప్పుడు సందేహాల్లో పడింది. 60 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రంలో అధికారపక్షమైన కాంగ్రెస్ కు చెందిన 21 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. విపక్ష బీజేపీకి చెందిన11 మంది ఎమ్మెల్యేలు.. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిసి బుధవారం ఈటానగర్ లోని ఒక కమ్యూనిటీహాల్లో సమావేశమయ్యారు.

అసెంబ్లీ స్పీకర్ ను అభిశంసిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 60 మంది సభ్యుల్లో 34 మంది ఎమ్మెల్యేలు ఒకజట్టుగా మారటంతో అధికారపక్ష ఉనికి ప్రమాదకరంగా మారటంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా.. అరుణాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనన్న విషయాన్ని గుర్తించి.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. మాజీ ప్రధాని మన్మోహన్ తదితర నేతలు భేటీ అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రం.. గవర్నర్ సహకారంతో కుట్ర పన్నుతోందని ఆరోపించింది. మరోవైపు.. పార్లమెంటులోనూ అరుణాచల్ ప్రదేశ్ లో ఏర్పడిన పరిస్థితిపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.

దీనిపై స్పందించిన బీజేపీ.. అరుణాచల్ ప్రదేశ్ లో అత్యవసరస్థితి లాంటి పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇంకోవైపు.. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్ ఖోవా.. ముఖ్యమంత్రి నబమ్ తుకి మధ్య సంబంధాలు అంతగొప్పగా లేని నేపథ్యంలో.. అరుణాచల్ ప్రదేశ్ లో అధికారబదిలీకే ఎక్కువ అవకాశం ఉందని చెప్పొచ్చు. అదే జరిగితే.. మోడీ సర్కారు మీద విపక్షాలు మూకుమ్మడి దాడి చేయటం ఖాయం.