Begin typing your search above and press return to search.

ఇప్పుడున్న‌ది మోడీ కోడ్ ఆఫ్ కాండాక్ట్‌!

By:  Tupaki Desk   |   2 May 2019 5:03 AM GMT
ఇప్పుడున్న‌ది మోడీ కోడ్ ఆఫ్ కాండాక్ట్‌!
X
కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఈసీపై రాజ‌కీయ‌పార్టీలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేయ‌టం తెలిసిందే. అధికార ప‌క్షానికి అనుకూలంగా.. విప‌క్షాల‌కు ఇబ్బంది క‌లిగించే రీతిలో ఈసీ తీరు ఉంద‌న్న వాద‌నను ప‌లు రాజ‌కీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఈసీ ఇచ్చిన క్లీన్ చిట్ పై కాంగ్రెస్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

వార్దాలో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌సంగంలో ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంఘించింది లేదంటూ ఈసీ చెప్ప‌టాన్ని కాంగ్రెస్ త‌ప్పు ప‌ట్టింది. ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ర‌ణ్ దీప్ సూర్జేవాలా సోష‌ల్ మీడియాలో రియాక్ట్ అవుతూ.. ఈసీ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది.

ఈసీ ఎన్నిక‌ల నియ‌మావ‌ళి.. మోడీ కోడ్ ఆఫ్ కాండ‌క్ట్ గా మారిన‌ట్లు స్ప‌ష్ట‌మైన‌ట్లుగా చెప్పారు. ఆర్టిక‌ల్ 324తో పాటు ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన ప్ర‌ధానికి ఎలాంటి శిక్ష ప‌డ‌క‌పోవ‌టం నిరాశ‌కు గురి చేసింది. మోడీకి ఒక న్యాయం.. ఇత‌రుల‌కు మ‌రో న్యాయం ఉండ‌టం స‌రికాదంటూ ఘాటైన వ్యాఖ్య‌ను చేశారు.

ఇటీవ‌ల ప్ర‌ధాని వార్దాలో చేసిన ప్ర‌సంగంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి పోటీ చేయ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు. వయ‌నాడ్ లో రాహుల్ పోటీ ద్వారా హిందువుల‌ను అవ‌మానించిన‌ట్లుగా వారు భావిస్తున్న‌ట్లుగా మోడీ వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఉన్నాయి. మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాన్ని రాహుల్ ఎంపిక చేసుకున్నారంటూ మోడీ చేసిన వ్యాఖ్య‌పై కాంగ్రెస్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. ఫిర్యాదు చేసింది. మోడీ వ్యాఖ్య‌ల్లో ఎలాంటి కోడ్ ఉల్లంఘ‌న‌లు లేవ‌ని ఈసీ తేల్చ‌టంపై కాంగ్రెస్ కొత్త త‌ర‌హా వ్యాఖ్య‌ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది.