Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లోకలా? నాన్ లోకలా?

By:  Tupaki Desk   |   31 Aug 2021 10:30 AM GMT
హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లోకలా? నాన్ లోకలా?
X
తెలంగాణ రాజకీయం మొత్తం హుజూరబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ.. టీఆర్ఎస్ లు తమ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని తేల్చేయటం తెలిసిందే. మరి.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే హుజూరాబాద్ లో కాంగ్రెస్ మూడో స్థానం కోసం పోరాడటం తప్పించి మరో మాటే లేదు. పోటీ మొత్తం అధికార టీఆర్ఎస్ అభ్యర్థి వర్సెస్ బీజేపీ అభ్యర్థి ఈటల మధ్యనే ఉంటుందని చెప్పాలి. పేరుకు త్రిముఖ పోటీ అయినప్పటికీ.. పోలింగ్ యుద్ధం మాత్రం ఆ రెండు పార్టీల మధ్యనే ఉండటం ఖాయం.

ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్.. తమ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయటంలో జాగు చేస్తోంది. ఇంకా సమయం ఉందనో.. అభ్యర్థిపై మధనం జరుగుతుందనో చెప్పటమే తప్పించి.. అభ్యర్థి ఎంపిక మీద సీరియస్ నెస్ పెద్దగా లేదన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉంది. ఇంతకాలం బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతామని చెబుతూ.. హుజూరాబాద్ తో కానీ.. కనీసం ఆ జిల్లాతో కానీ సంబంధం లేని వారి పేర్లు వినిపించటం తెలిసిందే.

మరోవైపు.. కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు హుజురాబాద్ కు చెందిన స్థానిక నేతను బరిలోకి దించాలన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. పనిలో పనిగా లోకల్.. నాన్ లోకల్ వాదనను తీసుకొచ్చారు. జిల్లాకు.. నియోజకవర్గానికి సంబంధం లేని వారిని బరిలోకి నిలిపితే భారీ నష్టమన్న మాట వినిపిస్తోంది. దీంతో..నేతల వాదనల నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక మరింత ఆలస్యమవుతుందని చెప్పాలి. స్థానిక నేతకే ఇవ్వాలని దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. జీవన్ రెడ్డిలు కోరుతుంటే.. ప్రాంతాలతో సంబంధం లేకుండా బలమైన అభ్యర్థిని బరిలోకి దించే విషయం మీదనే ఫోకస్ చేయాలంటున్నారు.

మొత్తంగా ఈ లెక్క ఒక కొలిక్కి వచ్చేందుకు సెప్టెంబరు 10 తర్వాతే అభ్యర్థి నియామకం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకునే వారు దరఖాస్తుల్ని ఇవ్వాలని చెబుతున్నారు. ఇందుకోసం సెప్టెంబరు 9 వరకు గడువు ఇస్తున్నట్లు చెబుతున్నారు. అనుకుంటాం కానీ అభ్యర్థిత్వం కోసం అప్లికేషన్లు పెట్టుకున్న వారిలో ఒక్కరికైనా ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్ ఇచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఫార్సు కోసమే తప్పించి.. నిజంగా అభ్యర్థిని డిసైడ్ చేయాలన్నఆలోచన ఉందా? అన్నది కూడా సందేహమే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అభ్యర్థి పేరును వెంటనే ప్రకటించటం ద్వారా హడావుడి మాత్రమే కాదు.. లేనిపోని గ్రూపులతో అనవసరమైన రచ్చకు తెర తీసినట్లు అవుతుందని పేర్కొన్నారు. అందుకే.. టికెట్ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పోస్టు పోన్ చేయటం ద్వారా.. నోటిఫికేషన్ విడుదలయ్యేవరకు పేరును ప్రకటించకుండా ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అభ్యర్థి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం రాలేదన్న రేవంత్ రెడ్డి మాటలు ఇందుకేనని చెబుతున్నారు. మొత్తంగా.. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కంటే కూడా.. దాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేసే విషయంలోనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారన్న అభిప్రాయం ఎక్కువ అవుతోంది.