Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై క‌సి తీర్చుకున్న జీవ‌న్ రెడ్డి!

By:  Tupaki Desk   |   27 March 2019 5:30 AM GMT
కేసీఆర్ పై క‌సి తీర్చుకున్న జీవ‌న్ రెడ్డి!
X
న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం.. ప‌దిసార్లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ.. ఆరుసార్లు గెలుపు.. ఎన్టీఆర్ మంత్రివ‌ర్గంలో మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం.. వైఎస్ హ‌యాంలోనూ మంత్రిగా ప‌ని చేసిన ట్రాక్ రికార్డు ఉన్న తాటిప‌ర్తి జీవ‌న్ రెడ్డికి గెలుపు తీపి ఎంత‌గా తెలుసో.. ఓట‌మి చేదు అంతే బాగా తెలుసు. స‌మితి అధ్య‌క్షుడిగా 1981లో గెలిచిన ఆయ‌న‌.. టీడీపీ ఆవిర్భావంలో జ‌గిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంట‌నే మంత్రి ప‌ద‌విని సొంతం చేసుకున్న ఆయ‌నకు ఇప్పుడు 67 ఏళ్లు. టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మంత్రివ‌ర్గంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న కాంగ్రెస్ సైనికుడిగా వ్య‌వ‌హ‌రించారు. గెలుపోట‌ముల్ని ప‌ట్టించుకోకుండా.. పార్టీ ఆదేశాల్ని తూచా త‌ప్ప‌కుండా పాటించేవారు.

ఓడిపోతాన‌ని తెలిసి కూడా యుద్ధంలోకి దిగి.. పోరాడ‌టం అంత సులువు కాదు. సెంటిమెంట్ బ‌లంగా ఉన్న వేళ‌.. ఓట‌మి త‌ప్ప‌ద‌న్న విష‌యం తెలిసినా.. వెన‌క‌డుగు వేయ‌కుండా పార్టీ అధినాయ‌క‌త్వం కోరిన‌ట్లుగా బ‌రిలో నిలిచి తెలంగాణ‌వాదుల విమ‌ర్శ‌ల‌కు గురైనా ఆయ‌న వెన‌క‌డుగు వేయ‌లేదు.

2006.. 2008లో వ‌రుస‌గా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై పోటీ చేసిన ఆయ‌న‌.. రెండుసార్లు గులాబీ బాస్ చేతిలో ఓట‌మిపాల‌య్యారు. అప్ప‌టి నుంచి కేసీఆర్ మీద బ‌దులు తీర్చుకునే అవ‌కాశం ఆయ‌న‌కు ల‌భించ‌లేదు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌.. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు.

ఇలాంటివేళ‌.. క‌రీంన‌గ‌ర్.. అదిలాబాద్‌.. నిజామాబాద్‌.. మెద‌క్ ప‌రిధిలోని ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఆయ‌న బ‌రిలో నిలిచారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వెన‌కుడుగు వేస్తున్న వేళ‌.. పార్టీ ఆదేశాల‌కు త‌గ్గ‌ట్లే బ‌రిలోకి దిగిన జీవ‌న్ రెడ్డి.. త‌న‌దైన‌ రీతిలో క‌ష్ట‌ప‌డ్డారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డై.. ఓట‌మి ఆవేద‌న‌లో ఉన్న ఆయ‌న మ‌రోసారి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు వెనుకాడ‌లేదు. ఈసారి గ‌ట్టిగా ప్ర‌య‌త్నించ‌టం.. ఓట‌మిని అధిగ‌మించి త‌న‌కున్న రాజ‌కీయ అనుభ‌వంతో ప్ర‌చారం జ‌రిపిన ఆయ‌నకు ఊహించ‌ని రీతిలో విజ‌యం సొంత‌మైంది.

తాజా ఆయ‌న సాధించిన విజ‌యం ఆయ‌న‌కు మాత్ర‌మే సొంతం కాదు. ఈ గెలుపుకు చాలానే ప్రాధాన్య‌త ఉంది. వ్య‌క్తిగ‌తంగా చూస్తే.. తాను రెండుసార్లు ఓట‌మిపాల‌య్యేందుకు కార‌ణ‌మైన కేసీఆర్ పై బ‌దులు తీర్చుకోవాల‌న్న కోరిక తాజా గెలుపుతో జీవ‌న్ రెడ్డికి తీరిన‌ట్లు అవుతుంది. కేసీఆర్ కు తిరుగులేదు.. అభ్య‌ర్థిగా ఆయ‌న ఎవ‌రిని బ‌రిలోకి దించినా విజ‌య‌మే త‌ప్పించి.. ఓట‌మి ఉండ‌ద‌న్న మాట త‌ప్ప‌న్న విష‌యాన్ని జీవ‌న్ రెడ్డి నిరూపించిన‌ట్లైంది.

అంతేకాదు.. ఆయ‌న తాజాగా సాధించిన విజ‌యం ఎంత అపురూప‌మైన‌దంటే.. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఉనికి ప్ర‌శ్నార్థ‌క‌మైనంద‌న్న భావ‌న బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళుతుంద‌న్్న వేళ‌.. అదంతా త‌ప్పు.. ప్ర‌య‌త్నించాలే కానీ కేసీఆర్ కు ఓట‌మి రుచి చూపించ‌టం అంత పెద్ద విష‌య‌మేమీ కాద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. అంతేనా.. ప్ర‌జ‌ల్లో త‌న ప‌ట్ల‌.. త‌న పాల‌న ప‌ట్ల పెరుగుతున్న వ్య‌తిరేక‌తకు నిద‌ర్శ‌నంగా తాజా ఎన్నిక‌ల ఫ‌లితం స్ప‌ష్టం చేసిన‌ట్లే.