Begin typing your search above and press return to search.

అధిష్టానంతో హామీ, కాంగ్రెస్‌లోనే సచిన్ పైలట్

By:  Tupaki Desk   |   11 Aug 2020 12:10 PM GMT
అధిష్టానంతో హామీ, కాంగ్రెస్‌లోనే సచిన్ పైలట్
X
గత కొన్నిరోజులుగా రసవత్తరంగా నడిచిన రాజస్థాన్ రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన సచిన్ పైలట్ కొద్ది రోజుల క్రితం అసంతృప్తితో తిరుగుబావుటా ఎగురవేశారు. బీజేపీలో చేరుతారని, ఆ తర్వాత కొత్త పార్టీ పెడతారని జోరుగా ప్రచారం సాగింది. గాంధీ కుటుంబంతో భేటీ అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని తేలిపోయింది. తాజాగా, సచిన్ పైలట్ తమ పార్టీలోనే కొనసాగుతారని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటన చేసింది.

అధిష్టానంతో చర్చల అనంతరం సచిన్ పైలట్ చల్లబడ్డారని, అందుకే పార్టీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తన ఆందోళనను పార్టీ అధిష్టానం అర్థం చేసుకుందని, సమస్య పరిష్కారానికి కృషి చేసిన వారందరికీ సచిన్ థ్యాంక్స్ చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర నాయకులు తమ ఆవేదనను అర్థం చేసుకున్నారని, తాను నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నానని, మెరుగైన భారత్ కోసం పని చేస్తానని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటామని, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతామని సచిన్ పైలట్ ట్వీట్ చేశారు.

ఇన్నాళ్ల ప్రతిష్టంభనపై సచిన్ పైలట్ స్పందిస్తూ.. తనకు ఎలాంటి సొంత అజెండా లేదన్నారు. కేవలం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సమస్యలను లేవనెత్తినట్లు తెలిపారు. కాగా, ఆయన లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. దీనిని సచిన్ స్వాగతించారు.

సొంత పార్టీ సీఎం అశోక్ గెహ్లాట్‌పై సచిన్ పైలట్ నెల రోజుల క్రితం అసమ్మతి స్వరం వినిపించిన విషయం తెలిసిందే. ఆయనతో ఇరవై మంది ఎమ్మెల్యేల వరకు కలిసి వచ్చారు. రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని ఈ సమస్యకు ముగింపు పలికింది.