Begin typing your search above and press return to search.

15 వేల లైకులు.. ఓ ఎమ్మెల్యే టిక్కెట్..

By:  Tupaki Desk   |   3 Sep 2018 1:28 PM GMT
15 వేల లైకులు.. ఓ ఎమ్మెల్యే టిక్కెట్..
X
సోషల్ మీడియా. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరి నోటి నుంచి ఇదే మాట వినిపిస్తోంది. మీకు ఫేస్‌ బుక్‌ అకౌంట్ ఉందా.... ట్విట్టర్ లో మీ ఫాలోయర్స్ ఎంత మంది అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. గతంలోలా పలకరింపులు లేవు. మాటల్లేవు.. మాట్లాడుకవడాలూ లేవు. ఉన్నదంతా ట్విట్టర్... పేస్ బుక్ యుగమే. దానిదే రాజ్యం. దాన్ని నమ్ముకుంటేనే ఏ పనైనా జరుగుతుంది. ఈ వెర్రి ఇప్పుడు రాజకీయ పార్టీలకు కూడా తగులుకుంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ట్విట్టర్ ద్వారానే ఏకేస్తున్నారనుకోండి. అలాగే దీనికి సమాధానం కూడా ప్రధాన మంత్రి ట్విట్టర్ ద్వారానే ఇస్తున్నారు. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కూడా కల్వకుంట్ల తారక రామారావు కూడా ట్విట్టర్‌ పైనే ఎక్కువగా స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ సోషల్ మీడియాకు చేరువకావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియానే నమ్ముకుంటోంది. అది ఎలా అనుకుంటున్నారా. ఏం లేదు. సింపుల్. ఇదిగో ఈ ఫార్ములాతోనే వారు ముందుకు వెళ్తున్నారు. దేశంలో త్వరలో నాలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - చత్తీస్‌ ఘడ్ వంటి కీలక రాష్ట్రాలూ ఉన్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికల విజయం 2019 సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే సెమీఫైనల్ ఎన్నికలు అంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అభ్యర్ధుల ఎంపిక నుంచి అన్నీ పగడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది.

మధ్యప్రదేశ్‌ లో భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ముందుగా అభ్యర్ధుల ఎంపికకు నూతన పద్దతికి శ్రీకారం చుట్టింది. అదే సోషల్ మీడియా ద్వారా అభ్యర్ధుల ఎంపిక అన్నమాట. అదెలాగనుకుంటున్నారా. సింపుల్. ఈ సారి ఎన్నికల్లో టిక్కట్లు ఆశిస్తున్న వారు తమ సొంత ఫేస్‌ బుక్ - ట్వట్టర్ ఎకౌంట్లలో ఎంత ఎక్కువ మంది ఫాలోయర్స్‌ ని చూపించగలిగితే వారికి టిక్కట్లు ఇస్తామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. ప్రతి అభ్యర్ధికి ఫేస్‌ బుక్ అకౌంట్లలో 15 వేల లైక్‌ లు - ట్విట్టర్ ఖాతాల్లో ఐదు వేల ఫాలోయర్లు ఉంటే వారికి టిక్కెట్లు ఖాయమని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. అంతే కాదు ప్రతి నియోజకవర్గంలోనూ బూత్ లెవెల్లోనూ వాట్పాప్ గ్రూపులు నిర్వహించాలని కూడా షరతు విధించింది. ఇక తాము చేసే ప్రతి ట్విట్‌ కు అభ్యర్ధులు వీలున్నంత త్వరగా రీ ట్విట్ చేయాలని కూడా నిబంధన విధిస్తోంది. ఇలా చేసిన వారికి టిక్కట్లు ఇస్తామని చెబుతోంది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ. దీనివల్ల ఎలాంటి లాభం ఉంటుందో తెలియదు కాని, అన్ని నియోజకవర్గాల్లోనూ నిరుద్యోగులకు కాంగ్రెస్ అభ్యర్ధులు తాత్కాలిక ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రయోగం ఫలిస్తే ఇదే ఫార్ముతలాను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తారేమో చూడాలి.