Begin typing your search above and press return to search.

సింగ‌పూర్‌ లో చ‌ర్చ‌లు..సీఎం సీటుపై సిద్ధూ హాట్ కామెంట్లు

By:  Tupaki Desk   |   13 May 2018 2:06 PM GMT
సింగ‌పూర్‌ లో చ‌ర్చ‌లు..సీఎం సీటుపై సిద్ధూ హాట్ కామెంట్లు
X
ప్రతిష్ఠాత్మక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ముగిసిన‌ప్ప‌టికీ హాట్ హాట్ ప‌రిణామాల‌తో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఓ వైపు ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ‌ను, అయోమ‌యాన్ని సృష్టిస్తుంటే...మ‌రోవైపు తాజాగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. పోలింగ్ అనంత‌రం రాష్ట్రంలో ఎన్నికల హడావుడి తగ్గింద‌నే భావ‌న‌ను నిజం చేస్తూ తాజాగా ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌టన‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన త‌ర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని దళితుడికి అప్పగించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి సిద్ధ‌రామ‌య్య‌ కీలక ప్రకటన చేశారు. అయితే తమ పార్టీ గెలిస్తే.. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకునేది అధిష్టానమేనంటూ ట్విస్టు ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు జేడీఎస్ నేత కుమార‌స్వామి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క‌న్న‌డ పోలింగ్ పూర్తయిన నేప‌థ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వాటి ఫలితాల మీదనే ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య సీఎం పీఠంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పీఠాన్ని దళితుడికి ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. పార్టీ హైకమాండ్ దళితుడినే కర్ణాటకకు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే తన సీఎం పీఠాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడబోనని సిద్దూ స్పష్టం చేశారు. దీంతో కర్ణాటకలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే...కర్ణాటక కాంగ్రెస్‌లో ఉన్న ఇద్దరు దళిత నాయకులు మల్లికార్జున ఖర్గే, జీ పరమేశ్వరకు ఫాలోయింగ్ బాగానే ఉంది. జేడీఎస్‌తో కలిసేందుకు దళితుడిని ముఖ్యమంత్రిగా చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ ఇప్పుడు తెరమీదికి తీసుకొచ్చిందా? అని కర్ణాటక రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

కాగా ఈ ప్ర‌క‌ట‌న‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్లకు ముందు పార్టీ విజయంపై ధీమాగా ఉన్న కాంగ్రెస్.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కొంచెం వెనక్కి తగ్గింది. హంగ్ ఏర్పడే చాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటంతో.. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి జేడీఎస్ మ‌ద్ధ‌తు చాలా అవసరం. జేడీఎస్ కింగ్‌మేకర్ కానున్న నేప‌థ్యంలో జేడీఎస్ సపోర్ట్ కోసం ఆ పార్టీ డిమాండ్లను ముందే ఊహిస్తున్నట్లు తెలుస్తోంది. క‌న్న‌డ ఫ‌లితాలు హంగ్ అనే అంచ‌నా నేప‌థ్యంలో జేడీఎస్ ముందే బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేసింది. దీంతో జేడీఎస్ కాంగ్రెస్‌తో కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఈ నేప‌థ్యంలో సిద్ధ‌రామ‌య్య కామెంట్లు వ్యూహాత్మ‌క‌మేన‌ని అంటున్నారు.

ఇదిలాఉండ‌గా...జేడీఎస్ కింగ్ లేదా కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశముందనే ప్ర‌చారం జోరుగా సాగుతున్న సమయంలోనే జేడీఎస్ అధినేత కుమార స్వామి సింగపూర్ వెళ్లడం రాజ‌కీయ వ‌ర్గాల చూపును సింగ‌పూర్ వైపు ప‌డేలా చేసింది. హంగ్ అయ్యే పక్షంలో తాము ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే ఎత్తుగ‌డ‌ను నిర్ణ‌యించేందుకు ఆయన సింగపూర్ పర్యటన పెట్టుకున్నార‌ని అంటున్నారు. త‌మ పార్టీ మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మైన రెండు పార్టీల‌తో కుమారస్వామి చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. తమ డిమాండ్లకు ఎవరు మద్దతిస్తే వారితో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ఇదే విష‌య‌మై ఆ పార్టీల‌కు చెందిన మ‌ధ్య‌వ‌ర్తుల ముందు ఖ‌చ్చిత‌మైన డిమాండ్లు ఉంచార‌ని టాక్.