Begin typing your search above and press return to search.

నెల పాటు మీడియాకు దూరంగా కాంగ్రెస్‌!

By:  Tupaki Desk   |   30 May 2019 11:30 AM GMT
నెల పాటు మీడియాకు దూరంగా కాంగ్రెస్‌!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చూపించ‌టం.. ఓట‌ర్ల మ‌న‌సుల్ని దోచుకోవ‌టంలో ఫెయిల్ అయ్యింది రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. మోడీతో పోటీ ప‌డ‌టంలో రాహుల్ ఏ మాత్రం సూట్ కాద‌న్న విష‌యం తాజాగా వెలువ‌డిన ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తాయి.

ఇదిలా ఉంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ ఇమేజ్ దారుణంగా దెబ్బ‌తిన‌టంతో పాటు.. ఘోర వైఫ‌ల్యంపై త‌న‌కు తాను బాధ్య‌త తీసుకుంటూ.. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. అయితే.. ఆయ‌న రాజీనామాను కాంగ్రెస్ పార్టీ నో చెబుతోంది. రాహుల్ ను బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు.. యూపీఏ మిత్ర‌ప‌క్షాలు సైతం ఆయ‌న్ను రాజీనామా చేయొద్ద‌ని.. పార్టీకి దూరంగా ఉండొద్ద‌ని కోరుతున్నాయి.

అయిన‌ప్ప‌టికీ.. త‌న నిర్ణ‌యంతో ఎలాంటి మార్పు లేద‌ని రాహుల్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో.. కాంగ్రెస్ లో నాయ‌క‌త్వం అంశంపై తీవ్ర ఆనిశ్చితి ప‌రిస్థితి నెల‌కొంది. రాహుల్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటారా? పార్టీ ప‌గ్గాల్ని చేప‌డ‌తారా? అన్న అంశంపై క్లారిటీ రావ‌టం లేదు. ఇదిలా ఉంటే.. ఈ అంశాల మీద మీడియాతో చ‌ర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేదు.

పార్టీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు పార్టీ నేత‌లు ఎవ‌రికి వారు వ్యాఖ్యానిస్తే.. జ‌రిగే న‌ష్టం ఎక్కువ‌గా ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన కాంగ్రెస్ తాజాగా ఒక ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకుంది. మీడియాలో అందునా టీవీ మీడియంలో చ‌ర్చ‌కు పాల్గొనే కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రూ కూడా.. ఇక‌పై చ‌ర్చ కార్య‌క్ర‌మాలకు హాజ‌రు కాకూడ‌ద‌ని పార్టీ పేర్కొంది. త‌క్కువ‌లో త‌క్కువ నెల రోజుల పాటు ఈ తీరునే ప్ర‌ద‌ర్శించాల‌ని కోరారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఛాన‌ళ్ల‌లో కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రూ ఇంట‌ర్వ్యూలు.. చ‌ర్చాగోష్టి ల్లో పాల్గొన‌ద్ద‌ని పేర్కొన్నారు. రాహుల్ ఎపిసోడ్ పార్టీలో ఆగ‌మాగం అవుతున్న వేళ‌.. మీడియాకు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఎవ‌రూ వెళ్ల‌కూడ‌ద‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మోడీకి గ‌ట్టి కౌంట‌ర్ వేసే కాంగ్రెస్ నేత‌లంతా ఇప్పుడు మౌనంగా జ‌రుగుతున్న‌ది చూస్తూ ఉండాల్సి ఉంటుంది. మ‌రి..నెల పాటు నోరుక‌ట్టేసుకొని కూర్చోవాల‌న్న పార్టీ అధినాయ‌క‌త్వం ఆదేశాన్ని ఆ పార్టీ నేత‌లు ఎంత‌వ‌ర‌కూ అమ‌లు చేస్తారో చూడాలి