Begin typing your search above and press return to search.

ఈ దెబ్బతో కాంగ్రెస్ లేస్తుందా? మునుగుతుందా?

By:  Tupaki Desk   |   11 Nov 2019 8:30 PM GMT
ఈ దెబ్బతో కాంగ్రెస్ లేస్తుందా? మునుగుతుందా?
X
ఇంతవరకూ ఎన్నడూ కాషాయ కూటమితో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపిన దాఖలాలు లేవు. దేశంలో ఎన్నో ప్రాంతాయ పార్టీలున్నాయి. వాటిల్లో కొన్నింటితో కాంగ్రెస్ మితృత్వాలు, శతృత్వాలు నడిపింది. ఆఖరికి కమ్యూనిస్టులతో కూడా కొంత కాలం పాటు సన్నిహితంగా, మరి కొంత కాలం పాటు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఇలా కాంగ్రెస్ కు కూడా మిత్రులు, శత్రువులు మారుతూ వచ్చారు.

ఆఖరికి దశాబ్దాల రాజకీయ శత్రువు చంద్రబాబుతో కూడా కాంగ్రెస్ చేతులు కలిపింది. మొదటికే మోసం తెచ్చుకుంది. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు శివసేనతో చేతులు కలిపితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా తయారవుతుంది? అనేది ఆసక్తిదాయకమైన చర్చ!

శివసేన ఎలాగూ కాషాయ పార్టీనే. అందుకు అనుగుణంగా అది దశాబ్దాలుగా బీజేపీ సన్నిహిత పార్టీగా నిలిచింది. బీజేపీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది, బీజేపీ నేతలతో సేన నేతలు చాలా సన్నిహితంగా మెలిగారు. ఎన్ని తిట్టుకున్నా, విమర్శించుకున్నా బీజేపీతోనే సాగారు. అయితే ఇప్పుడు శివసేన తన పదవీ కాంక్షతో కాంగ్రెస్ తో చేతులు కలుపడానికి సై అంటోంది.

అది కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా శివసేన బీజేపీతో కలిసి పోటీచేసింది. అయితే ఇప్పుడు రూటు మార్చింది. సేన సంగతేమో కానీ, ఈ పొత్తుతో కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుంది? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.

ఎన్నడూ లేని రీతిలో కాషాయ పార్టీతో చేతులు కలిపి, కాంగ్రెస్ పార్టీ హిందుత్వ అనుకూల ఇమేజ్ పొందుతుందా? లేక అసహజమైన మైత్రితో కొత్త ఇబ్బందుల్లో పడుతుందా? అనేది ముందు ముందు తెలిసే రాజకీయ పరమైన అంశం అని పరిశీలకలు వ్యాఖ్యానిస్తున్నారు