Begin typing your search above and press return to search.
గుజరాత్ లో కాంగ్రెస్ కు ఊహించని షాక్
By: Tupaki Desk | 20 Nov 2017 9:41 AM GMTగుజరాత్ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్ఠానం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దాదాపు 22 ఏళ్లపాటు కొనసాగిన బీజేపీ పరిపాలనకు చరమగీతం పాడేందుకు కలిసివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. ఎలాగైనా మోదీ హవాకు చెక్ పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ యువరాజు ఆ కార్యక్రమాన్ని ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ నుంచే ప్రారంభించాలని కృతనిశ్చయంతో్ ఉన్నారు. దీనిలో భాగంగా పొత్తులకు సిద్ధమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. హార్దిక్ పటేల్ నేతృత్వంలోని పటీదార్ అనమత్ ఆందోళన్ సమితితో పొత్తు కుదుర్చుకుంది. పొత్తు ప్రకటన ఇలా వెలువడిందో లేదో ఆ పార్టీకి ఊహించని చిక్కొచ్చి పడింది.
గుజరాత్ లో కాంగ్రెస్-పటీదార్ అనమత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్ ) పొత్తు ప్రకటన వెలువడిన కాసేపటికే పరిస్థితులు తారుమారయ్యాయి. మొత్తం 77 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అందులో కేవలం మూడు స్థానాలను మాత్రమే పటేల్ వర్గానికి కేటాయించింది. దీంతో టికెట్ల కేటాయింపుపై చిచ్చు రాజుకుంది. సూరత్ - అహ్మదాబాద్ లో పీఏఏఎస్ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టింది. సూరత్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పటీదార్ వర్గీయులు-కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో పార్టీ ఆఫీస్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. ముందుగా పటీదార్ మద్దతుదారులు పార్టీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరినొకరిని తోసుకోవటంతో కొట్లాట మొదలైంది. దీంతో పోలీసులు పటీదార్ కార్యర్తలను అరెస్ట్ చేశారు. మరోపక్క పటీదార్ నేత దినేశ్ పటేల్ పలువురు కార్యకర్తలను వెంటపెట్టుకుని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్‌సిన్హ్ సోలంకి ఇంటికి వెళ్లారు. అయితే వారిని కలిసేందుకు భరత్ నిరాకరించటంతో బయటే ఆందోళన చేపట్టారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పదర్శనలు నిర్వహించేందుకు పటీదార్ వర్గం సిద్ధమైంది. ‘‘కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై పునరాలోచిస్తామని.. నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని దినేశ్ పటేల్ మీడియాకు తెలిపారు. అధికారంలోకి వచ్చాక పటేల్ వర్గానికి ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చబోతున్నారో కాంగ్రెస్ స్పష్టంచేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే వారి తరపున తాము ప్రచారానికి అంగీకరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులుపైనా ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు..ఇక హార్దిక్ పటేల్ లేకుండానే కాంగ్రెస్ పార్టీతో పీఏఏఎస్ ఆదివారం కీలక సమావేశం నిర్వహించింది. అనంతరం పీఏఏఎస్ కన్వీనర్ దినేశ్ బాంభానియా మాట్లాడుతూ.. రిజర్వేషన్ల ఫార్ములాపై మాత్రమే ఒప్పందం కుదరిందని.. సీట్ల పంపకం గురించి చర్చించలేదని వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అంశాలను సోమవారం రాజ్ కోట్ సభలో తమ అధినేత హార్దిక్ పటేల్ స్పష్టత ఇస్తారని దినేశ్ ప్రకటించారు.