Begin typing your search above and press return to search.

మరీ.. ఇంత దిగజారి మాట్లాడాలా కామత్..?

By:  Tupaki Desk   |   1 Aug 2015 4:20 PM GMT
మరీ.. ఇంత దిగజారి మాట్లాడాలా కామత్..?
X
విమర్శలు చేయటానికి ఒక హద్దుండాలి. ఎలా పడితే అలా మాట్లాడటం బాధ్యతగా అనిపించుకోదు. కానీ.. దూకుడు రాజకీయాలు పెరిగిపోయిన తర్వాత.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. ఎదుటివారి పేదరికాన్ని చులకన చేసి మాట్లాడటం.. పదవులు చేపట్టటానికి ఉన్నత వర్గాల్లోనే జన్మించాలన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం కాంగ్రెస్ నేతలకు కొత్తేం కాదు.

గురివిందలా వ్యవహరించే వారు.. తమ గురించి అస్సలు చూసుకోరు. తాజాగా గురుదాస్ కామత్ చేసిన వ్యాఖ్యలు.. మంట పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పరపతిని తన తాజా దురుసు వ్యాఖ్యలతో మరింత ఆత్మరక్షణలో పడేలా చేశారు. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన కామత్.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఆమెను పని మనిషిగా.. ఇల్లు తుడుచుకునేదిగా అభివర్ణించిన ఆయన.. ముంబయిలోని ఒక హోటల్ లో తుడవటం తాను కళ్లారా చూశానని చెప్పుకొచ్చారు. ఆమె ఆర్థిక పరిస్థితి సరిగా లేక.. హోటల్ లో టేబుల్స్ తుడిచేవారని ఎగతాళి చేసిన ఆయన.. ఇరానీని టెన్త్ క్లాస్ పాస్ ను తీసుకొచ్చి కేంద్రమంత్రిని చేశారంటూ ఎద్దేవా చేశారు.

నిజానికి ఇలాంటివి చౌకబారు వ్యాఖ్యలుగా చెప్పాలి. ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితిని చూసి ఎగతాళిగా మాట్లాడటం.. చులకన చేయటం కామత్ లాంటి వారికి ఏ మాత్రం సరికాదు. ఒకవేళ కామత్ మాదిరే కాసేపు దిగజారి మాట్లాడితే ఆయనేం సమాధానాలు చెబుతారు?

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ పరిస్థితి ఏమిటి? రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడటానికి ముందు ఆమె ఏం చేసేవారు? ఆమె విద్యార్హత ఏమిటి? మరి.. సోనియా లాంటి వ్యక్తి.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఎలా వ్యవహరించారో దేశం మొత్తానికే తెలుసు. ఎక్కడో ఇటలీలో పుట్టి.. కేవలం రాజీవ్ గాంధీ భార్య హోదాతో దేశ రాజకీయాల్ని శాసించటమే కాదు.. కామత్ లాంటి వారు నిత్యం సలాం చేసే దాని గురించి ఆయనేం చెబుతారు? ఇలాంటి బుద్ధిలేని వ్యాఖ్యల్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అయినా ఖండించి.. నోరు అదుపులో ఉంచుకోవాలని చెబితే బాగుంటుంది.