Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో డిగ్గీ కాలం ముగిసిన‌ట్లేనా ?

By:  Tupaki Desk   |   27 May 2018 9:07 AM GMT
కాంగ్రెస్ లో డిగ్గీ కాలం ముగిసిన‌ట్లేనా ?
X
1993 నుండి 2003 వ‌ర‌కు ప‌దేళ్లు మ‌ధ్యప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, 1969 నుండి రాజ‌కీయాల్లో ఉంటూ వ‌స్తున్న దిగ్విజ‌య్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘంగా చ‌క్రం తిప్పుతూ వ‌స్తున్నారు. 2013లో మొద‌టిభార్య ఆశాసింగ్ మ‌ర‌ణం అనంత‌రం 2015లో యాంక‌ర్ అమృతాసింగ్ ను రెండో పెళ్లి చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి దిగ్విజ‌య్ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారిన‌ట్లే క‌నిపిస్తోంది. ఈ మ‌ధ్య‌నే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జి ప‌ద‌వి నుండి తొల‌గించిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా మ‌రోసారి షాకిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ ను తొల‌గిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న స్థానంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఏపీ వ్యవహారాల పర్యవేక్షణ నిమిత్తం నియమించినట్టు రాహుల్ గాంధీ కార్యాలయం ఈ ఉద‌యం ఓ ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ కు అధికారం ద‌క్క‌కున్నా బీజేపీ ద‌క్క‌నివ్వ‌లేద‌ని, ఈ విజ‌యం వెన‌క రాహుల్ మంత్రాంగం ఉంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రిగే ప‌లు రాష్ట్రాల విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే ప్ర‌య‌త్నంలో రాహుల్ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జిగా కుంతియాను కాంగ్రెస్ అధిష్టానం నియ‌మించింది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంఛార్జి ప‌ద‌వి నుండి దిగ్విజ‌య్ ను త‌ప్పించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌దేళ్లు ప‌నిచేసిన దిగ్గీ సేవ‌ల‌ను ఛ‌త్తీస్ ఘ‌డ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ల‌కు వినియోగించుకుంటార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ మ‌ధ్య కాలంలో దిగ్విజ‌య్ కీల‌కంగా ప‌నిచేసిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాలేక‌పోగా, ఆ త‌రువాత కూడా పుంజుకునేందుకు ఏ మాత్రం చ‌ర్య‌లు తీసుకోలేద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆ అవ‌కాశాలు కూడా క‌నిపించ‌డం లేదు. తెలంగాణ ఇంఛార్జిగా వ‌చ్చిన కుంతియా అనేక సార్లు ప‌ర్య‌టిస్తుండ‌గా దిగ్విజ‌య్ అస‌లు ఆంధ్రాలో ప‌ర్య‌టించిన దాఖ‌లాలు లేవు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను త‌ప్పించిన‌ట్లు స‌మాచారం.