Begin typing your search above and press return to search.

రఫేల్ ఆడియో టేపు మంత్రి విశ్వజిత్ కాంగ్రెస్ కోవర్టా?

By:  Tupaki Desk   |   3 Jan 2019 4:21 AM GMT
రఫేల్ ఆడియో టేపు మంత్రి విశ్వజిత్ కాంగ్రెస్ కోవర్టా?
X
మరోసారి సంచలనంగా మారిన రఫేల్ కుంభకోణం వ్యవహారంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన ఆడియో టేపుల్లో మాట్లాడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా మంత్రి విశ్వజిత్ రాణెపై అందరి దృష్టీ పడింది. అంతేకాదు.. ఆయన నేపథ్యం తెలిసినవారంతా కాంగ్రెస్ పార్టీకి ఆయన కోవర్టుగా పనిచేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బాగా వాడుకుని బీజేపీని ఇరుకునపెడుతోందని అంటున్నారు.

విశ్వజిత్ రాణె నిజానికి గత ఏడాది వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. గత ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ నుంచే గెలిచారు. అయితే... అప్పుడు కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో రాణె బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యంకాలేదని విమర్శిస్తూ బీజేపీలో చేరి మంత్రి పదవి కూడా కొట్టేశారు.

రాణె తండ్రి ప్రతాప సింహ రాణె కూడా కాంగ్రెస్ పార్టీ నేత. అంతేకాదు.. ఆయన ఆరు సార్లు గోవా సీఎంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో విశ్వజిత్ రాణె బీజేపీలో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయనతో టచ్ లో ఉందని.. కొద్దికాలంగా అక్కడ సీఎం మార్పు కోసం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విశ్వజిత్‌ ను చక్కగా వాడుకుందని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా పనిచేశారన్న వాదన వినిపిస్తోంది. ఈ సంభాషణలు నిజం కాకపోవచ్చన్న వాదనా వినిపిస్తోంది. నిజంగా పారికర్ పడగ్గదిలోనే ఆ పేపర్లు ఉన్నా కూడా ఆయనలాంటి స్థితప్రజ్ఞుడు ఇలా కేబినెట్లో ఇలాంటి రహస్యాలు చెబుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.