Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క స‌ర్కారులో కుంప‌ట్లు..!!

By:  Tupaki Desk   |   26 Jun 2018 5:30 PM GMT
క‌ర్ణాట‌క స‌ర్కారులో కుంప‌ట్లు..!!
X
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కుంప‌ట్లు మొద‌ల‌య్యాయి. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే విభేదాలు తలెత్తాయి. పూర్తిస్థాయి బడ్జెట్ విషయంలో అభిప్రాయ భేదాలు మొద‌ల‌య్యాయి. మాజీ ముఖ్య‌మంత్రి - ప్ర‌భుత్వ సమన్వయ కమిటీ చైర్మన్ అయిన సిద్ధరామయ్య పూర్తిస్థాయి బడ్జెన్‌ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జులై 5న బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టాలా వద్దా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. రైతుల రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తామని కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం చెప్పింది. దీనికి పది వేల కోట్లు అవసరం ఉంది. ఈ విష‌యంలో ఇబ్బందులు ప‌డుతున్నారు.

గత ఫిబ్రవరిలోనే అప్పటి సీఎం కమ్ ఆర్థిక మంత్రి సిద్ధరామయ్య ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ అవసరం లేదని, సప్లిమెంటరీ బడ్జెట్ చాలు అని ఆయన వాదిస్తున్నారు. దీనిపై ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి విభేధిస్తున్నారు. బడ్జెట్ విషయంలో సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు సభ్యులు అయోమయ పరిస్థితులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని, ఈ విషయంలో తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేదని కుమారస్వామి స్పష్టంచేశారు. బడ్జెట్‌ ను పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ప్రవేశపెట్టాలని కొందరు చెబుతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు.

బ‌డ్జెట్ విష‌యంలో విబేధాలు ఉన్నట్లు సీఎం కుమారస్వామి అంగీకరించారు. `ఫిబ్రవరి బడ్జెట్ సమయంలో ఉన్న వంద మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు లేరు. ఆ వంద మంది కొత్తగా వచ్చిన వాళ్లు ఉన్నారు`` అని కుమారస్వామి చెప్పారు. ``కొత్తగా వచ్చిన వంద మందికి పాత బడ్జెట్‌ పై అసలు అవగాహన లేదు. పాత బడ్జెట్‌ నే కొనసాగిస్తే అది కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నది నా అభిప్రాయం. ఎవరైనా దీనిపై ప్రివిలిజ్ మోషన్ జారీ చేస్తే నేనేం చేయాలి అని కుమారస్వామి ప్రశ్నించారు. రైతుల రుణ మాఫీ చేస్తే నాకేమైనా కమీషన్ వస్తుందా.. అయినా ప్రభుత్వంలో ఎవరికి కమీషన్లు వెళ్తాయో నాకు తెలుసు`` అంటూ ఆయన అనడం గమనార్హం.