Begin typing your search above and press return to search.

సిద్దూ చేతికి స్పీడెక్కువే..అనుచరిడికి చెంప దెబ్బ

By:  Tupaki Desk   |   4 Sept 2019 11:32 AM
సిద్దూ చేతికి స్పీడెక్కువే..అనుచరిడికి చెంప దెబ్బ
X
కర్ణాటక మాజీ సీఎం - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు నిజంగానే చేతి వాటం ఎక్కువే ఉన్నట్టుంది. ఎప్పుడూ ఎవరినో ఒకరిని కొట్టందే... ఆయన చేయి శాంతించేలా లేదు. గతంలో ఈ చేతి వాటం తోనే అడ్డంగా బుక్కైన సిద్దూ... ఈ సారి సదరు చేతి ఉలారంతోనే మరోమారు బుక్కయ్యారు. గతంలో ఓ అధికారి చెంప చెళ్లుమనిపించిన సిద్దరామయ్య... ఈ సారి ఏకంగా సొంత అనుచరుడిపైనే చేయి చేసుకున్నారు. అంతేకాదండోయ్... సిద్దూ చేయి పైకి లేచే సమయంలో ఆయన ముఖంలో కనిపించే ఉగ్రరూపం నిజంగానే చాలా వెరైటీగా ఉంటుందని చెప్పక తప్పదు. మొత్తంగా తన చేతి దూలతో సిద్దూ మరోమారు అడ్డంగా బుక్కయ్యారు.

బెంగళూరులోని ఎయిర్ పోర్టులో సిద్దూ తన అనుచరుడిపై చేయి చేసుకున్నట్లుగా కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తన నేతకు ఏదో కీలక అంశం చెప్పేందుకు దగ్గరగా వచ్చి వంగి వంగి మరీ చెబుతున్న అనుచరుడి వైపు ఓ భీకర లుక్కేసిన సిద్దూ... ఉన్న పళంగా తన చేతిని లేపి అతడి చెంప చెళ్లుమనిపించారు. అంతటితో ఆగని సిద్దూ... అతడిని భుజం పట్టుకుని ముందుకు నెట్టారు. ఎంతైనా తమ నేత కదా... సిద్దూ చెంప పగులగొట్టినా... ఆయన అనుచరుడు కిమ్మనకుండానే ఆయనను అనుసరించారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు అక్కడే పోలీసులు ఉన్నా కూడా వారు మౌనం వహించక తప్పలేదు.

అప్పుడెప్పుడే తాను సీఎంగా ఉన్న సమయంలో చిక్ మగళూరు పర్యటనకు వెళ్లిన సందర్భంగా సీఎం హోదాలో అక్కడి ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన సిద్దూ... దానికి సమాధానం ఇచ్చేందుక ముందుకు వచ్చిన ఓ ఐఏఎస్ అధికారి చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన తాజా ఘటన మాదిరే అడ్డంగా కెమెరాకు చిక్కడంతో సిద్దూ అభాసుపాలయ్యారు. ఎంత సీఎం అయితే మాత్రం అధికారులని కూడా చూడకుండా ఇలా చెంపలు చెళ్లుమనిపిస్తే ఎలాగంటూ నాడు అధికారులంతా ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే సీఎం పదవిలో ఉన్న సిద్దూ ఆ ఆందోళనను ఎలాగోలా విరమింపజేశారనే చెప్పాలి. అయితే ఇప్పుడు సిద్దూ చేయి తన అనుచరుడిపైనే పడిన నేపథ్యంలో సిద్దూకు ఆందోళన భయం అక్కర్లేదన్న కోణంలో సెటైర్లు పడుతున్నాయి.