Begin typing your search above and press return to search.

టీడీపీ-కాంగ్రెస్ పొత్తు..మొద‌టి వికెట్ ప‌డింది

By:  Tupaki Desk   |   11 Sep 2018 4:01 AM GMT
టీడీపీ-కాంగ్రెస్ పొత్తు..మొద‌టి వికెట్ ప‌డింది
X
పొత్తు రూపం దాల్చ‌క‌ముందే...కాంగ్రెస్‌ - టీడీపీల మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటు టీడీపీ అటు కాంగ్రెస్ నేత‌లు ఈ పొత్తుపై వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో భ‌గ్గుమంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అసంతృప్తి తారాస్థాయికి చేరుకొని ముఖ్య‌నేత‌లు పార్టీకి గుడ్ బై చెప్పేవ‌ర‌కు ప‌రిస్థితి చేరింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు ఈ పొత్తుల కార‌ణంగా హ‌స్తం పార్టీకి గుడ్ బై చెప్పేయ‌డం క‌ల‌క‌లంగా మారింది. ఆయ‌న టీఆర్ ఎస్ గూటికి చేరుతుండ‌టం గ‌మ‌నార్హం. గ్రేట‌ర్‌లో ముఖ్య‌నాయ‌కుడు పార్టీ మారేందుకు కార‌ణం టీడీపీ నేత కావ‌డం ఆస‌క్తిక‌రం.

తెలంగాణ‌లో కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ - కాంగ్రెస్ పోటీ చేసే సీట్ల‌పై ఇప్ప‌టికే సూత్ర‌ప్రాయ అంగీకారం కుదిరింది. ఇందులో ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది. టీడీపీ సీనియ‌ర్ నేత దేవేంద‌ర్ గౌడ్ త‌న‌యుడు వీరేంద‌ర్ గౌడ్‌ కు ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కేటాయిస్తున్న‌ట్లు ఇరు పార్టీల‌ నేత‌లు చ‌ర్చించుకున్నారు. అయితే దీనిపై ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండారి ల‌క్ష్మారెడ్డి భ‌గ్గుమ‌న్నారు. పార్టీ నిర్ణ‌యాన్ని దిక్క‌రిస్తూ...త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ ఎస్‌ లో చేరేందుకు డిసైడ్ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ప‌త‌నం చేయ‌డానికి స్థాపించిన తెలుగు దేశం పార్టీతో పొత్తులో భాగంగా చేతులు క‌ల‌ప‌డమ‌ని ఆరోపించారు. టీడీపీ నుంచి వీరేంద‌ర్ గౌడ్‌ కు ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కేటాయిస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తెలుప‌డంతో టీఆర్ ఎస్‌ లో చేరుతున్న‌ట్లు తెలిపారు.త‌న‌తో పాటుగా నియోజ‌వ‌క‌ర్గంలోని రెండు స‌ర్కిళ్ల అధ్య‌క్షులు, తొమ్మిది డివిజ‌న్ల కార్పొరేట‌ర్ అభ్య‌ర్థులు - డివిజ‌న్ ప్రెసిడెంట్లు - అన్ని అనుబంధ సంఘాల క‌మిటీ స‌భ్యులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ల‌క్ష్మారెడ్డి వెళ్ల‌డించారు. కాగా, ఆయ‌న రాజీనామా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద‌ షాక్ అని పేర్కొంటున్నారు.